- ముగ్గుల పోటీలతో సంస్కృతికి జీవం

- కమిషనర్ పివివిస్ మూర్తి

నెల్లూరు, జనవరి 12, (రవికిరణాలు) : సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపట్ల యువత ఆసక్తి చూపుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక 43వ డివిజన్ కోటమిట్టలోని నగర పాలక సంస్థ పాఠశాలలో ముగ్గుల పోటీలను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కమిషనర్ రంగవల్లుల పోటీల్లో పాల్గొన్న మహిళలను ప్రత్యేకంగా అభినందించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లులను అందంగా తీర్చిదిద్దడంలో మహిళలు అద్భుతమైన సృజన కనబర్చారని ప్రశంసించారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఇలాంటి విశిష్టమైన కార్యక్రమాలు ఎంతగానో దోహద పడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ స్థానికులైన హిందు - ముస్లింలు కలిసి రంగవల్లుల పోటీలను నిర్వహించడం శుభ పరిణామం అని కమిషనర్ సంతోషం వ్యక్తం చేసారు. ఇతర మతస్థుల సాంప్రదాయాలకు గౌరవమిస్తూ, సోదరభావంతో అన్ని పండుగలలో భాగస్వామ్యమవడం ఆదర్శనీయమని నిర్వాహకుల సేవలను కమిషనర్ కొనియాడారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేసారు. 43 వ డివిజన్ స్థానికుడు నయీమ్ ఖాన్ ఆధ్వర్యంలో ఖాదర్ బాషా అధ్యక్షతలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వసుమతి, తహసీల్దార్ నాజర్, చిన్నబజార్ ఎస్సైలు, మాజీ కార్పొరేటర్
ఖలీల్ అహ్మద్, ఏపీఆర్ హెల్పింగ్ హాండ్స్ అధినేత నిజాముద్దీన్, జియా, అలీం తదితరులు పాల్గొన్నారు.