శ్రీసిటీ పురోగతిని సమీక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్

రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ :

తిరుపతి  జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి శుక్రవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో శ్రీసిటీ పురోగతిని సమీక్షించారు. అధికారుల జోక్యం అవసరమయ్యే కొన్ని పనులను ప్రధానంగా ప్రస్తావిస్తూ, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా అధికారులకు సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, నూతన జిల్లా ఏర్పాటు అనంతరం ప్రప్రధమంగా శ్రీసిటీకి విచ్చేసిన జిల్లా ప్రధమ కలెక్టర్ కు ఘన స్వాగతం పలుకుతున్నామన్నారు. శ్రీసిటీ ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వ అధికారుల నుండి, ముఖ్యంగా జిల్లా పరిపాలన విభాగం నుండి అద్భుతమైన మద్దతు, సహకారం అందుతోందని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము అన్నారు. జిల్లాలో ‘సులభతర వ్యాపారం’ (Ease of Doing Business) ను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపడుతున్న చురుకైన చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీసిటీకి అనుసంధాన రోడ్లను పటిష్టం చేయాలని, కాళహస్తి - తడ రహదారిని విస్తరించాలని  సత్యవేడు ఎమ్మెల్యే కె.ఆదిమూలం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను కోరారు. తన దృష్టికి తెచ్చిన అన్ని అంశాలను ఒక్కొక్కటిగా సమీక్షించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు శ్రీసిటీ పరిసరాలు చుట్టి చూశారు. శ్రీసిటీని సందర్శించినందుకు జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులకు శ్రీసిటీ ఎండీ ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా రెవెన్యూ అధికారి  శ్రీనివాసరావు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కెఎం రోజ్‌మండ్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీమతి ఎస్ఎస్ సోనీ, సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్, విద్యుత్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.