మోడీతో చంద్రబాబు భేటీ-విన్నపాల చిట్టా ఇదే



ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన సీఎం.. అనంతరం ప్రధాని మోడీ వద్దకు వెళ్లారు. వీరిద్దరూ దాదాపు గంటసేపు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

 ప్రధాని మోడీతో ఇవాళ జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు ప్రధానంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు ఆండగా నిలవాలని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్ జగన్ కారణంగా ఈ రెండు కీలక అంశాలు మరుగునపడ్డాయని, ఇప్పుడు ఏపీ తిరిగి పుంజుకోవాలంటే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కీలక సాయం అవసరం అవుతుందనని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, విభజన హామీలపైనా చొరవ తీసుకోవాలని చంద్రబాబు కోరారు. 
 
 ప్రధాని మోడీతో దాదాపు గంట భేటీ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి కేంద్రమంత్రుల్ని కలిసేందుకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోనూ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ, మధ్యాహ్నం 2.45 గంటలకు హోం మంత్రి అమిత్‌షాతోనూ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు.

అలాగే రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం,10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 10.45 గంటలకి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ కానున్నారు, తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం సమావేశం ముగించుకుని హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఎల్లుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ ఉంటుంది.