కరెంట్ ఛార్జీల్లో మళ్ళీ మోసం జరిగింది
కరెంట్ ఛార్జీల్లో మళ్ళీ మోసం జరిగింది -పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 147వ రోజున 49వ డివిజన్ యనమలవారివీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తిరుగుతుంటే అనేక ఇళ్ళలో ప్రజలు కరెంట్ బిల్లులు చూపించి విపరీతంగా ఎలా పెరిగాయో చూపిస్తున్నారన్నారు. గతేడాది ఓ నెలలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో వాడని కరెంటుకి బిల్లులు ఎలా వసూలు చేశారో, ఈ ఏడాది కూడా అదే మోసానికి ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా నూతన కరెంట్ బిల్లులు ఇంకా తీయలేదని, రోజులు పెరిగితే యూనిట్లు పెరిగి స్లాబ్ మారి అది కూడా సామాన్యులకు భారంగా మారుతోందని అన్నారు. ఉచితాలను ఎర వేసి పన్నులు, బిల్లుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని, ఈ ప్రభుత్వ అసంబద్ధ విధానాలే రేపటి జనసేన పార్టీ గెలుపుకు కొలమానాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.