రాబోయే మూడేళ్లలో మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తా





తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, రోడ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత

పూర్తి వివరాలతో ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేస్తున్నా

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరు నగరంలో పలు డివిజన్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి 

నెల్లూరు, జనవరి 11 : రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శనివారం వేకువజామున నెల్లూరు నగరంలో 47,48,50,51,52 డివిజన్లలోని తోటబడి, పాత మున్సిపల్‌ ఆఫీస్‌ .కుక్కలగుంట.జలకన్య బొమ్మ, సంతపేట మార్కెట్‌ ప్రాంతాల్లో  మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి కార్మికుల అటెండెన్స్‌ తీసుకున్నారు. స్థానిక ప్రజల సమస్యల అడిగి తెలుసుకున్నారు.  మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ చాలా ప్రధానమని, పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలానికి ముందే ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో డీసిల్టింగ్‌ పనులు చేపట్టామని,  దీని కోసం మున్సిపాలిటీలకు  50 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినట్లు చెప్పారు. ఇస్టానుసారంగా నిధులు దారి మళ్లించడం వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి, మున్సిపాలిటీలకు రావాల్సిన 5300 కోట్లు నిధులు ఆగిపోయాయని చెప్పారు. రాబోయే మూడేళ్లలో మున్సిపాలిటీల్లో 100శాతం సాలిడ్‌ వేస్ట్‌ ,లిక్విడ్‌ వేస్ట్‌, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పన అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వీటి కోసం డిపిఆర్లు తయారు చేస్తున్నట్లు చెప్పారు. 

డిపిఆర్‌లు  కేంద్రానికి నివేదించి నిధులు తీసుకొస్తామన్నారు. సంతపేట మార్కెట్లో పాత బట్టల వ్యాపారం చేసుకునే వారికి షాప్‌లు గతంలో కేటాయించామని, వాటిలో 72 షాపులకు గాను 50 షాపులు ఖాలీగా వున్నాయని, షాపులు కేటాయించినవారు  వ్యాపారాలు చేసుకోవాలని, లేకపోతే వారికి ఇచ్చిన షాపులను రద్దు చేసి అర్హులైన పేదవారికి ఇస్తామన్నారు. ఉయ్యాల కాలువ లో వర్షాకాలంలో సిల్ట్‌ తొలగించామని, అయితే పూడిపోయిందని స్థానికులు చెప్పారని, మళ్లీ సిల్ట్‌ తొలగిస్తామన్నారు. ముఖ్యంగా ఉదయాన్నే కూలి పనులకు వెళ్లే నిరుపేదల కోసం 2014లో అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్‌ వంటి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిశీలించి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసామన్నారు. కొన్నిచోట్ల సకాలంలో ఆహార పదార్థాలు రావడం లేదని స్థానికులు చెబుతున్నారని, దీనిపై ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడాలని డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ హరి నారాయణతో ఫోన్లో మాట్లాడి సకాలంలో ఆహార పదార్థాలు చేరుకునేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రూరల్‌ ప్రాంతాల్లో 67 అన్నా క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీల్లోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అన్ని సేవలను సరళీకృతం చేస్తూ జీవో కూడా ఇచ్చినట్లు చెప్పారు. 20 రాష్ట్రాల్లో మున్సిపల్‌ అధికారులతో చర్చించామని, బిల్డర్స్‌ అసోసియేషన్‌ వారితో కూడా సంప్రదించి జీవోను ఇచ్చినట్లు చెప్పారు. దీంతో ఇళ్లు నిర్మించుకునే ప్రతిఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి జరిగే ప్రతి పనిని కూడా చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. మంత్రి వెంట మున్సిపల్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వున్నారు.