రోడ్లపై సంచరిస్తున్న పశువులు పట్టించుకోని అధికారులు 




నెల్లూరు టౌన్, మేజర్ న్యూస్:

నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలకు అడ్డంగా పశువులు సంచరిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వాకర్స్ రోడ్డు, ఆచారి వీధి, మినీ బైపాస్, లాంటి  పలు ప్రాంతాల్లో పశువులు రోడ్లకు అడ్డంగా వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నాయి.  పశువుల యజమానులు కొందరు ఇష్టానుసారంగా పశువులను రోడ్లపైకి వదిలేస్తుండడంతో నగరంలో కొన్నిచోట్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పశుగ్రాసం కొరత వల్ల పశువులకు ఆహారం దొరకక పోవడంతో అవి రోడ్లపై సంచరిస్తున్నాయి. రోడ్లపై ఉన్న చెత్తతోపాటు ప్లాస్టిక్ కవర్లను కూడా తింటూ అనారోగ్యాల బారిన పడుతున్నాయి. ఇందుకు అధికారుల పర్యవేక్షణ కొరవడడం, పశువుల యజమానులు సైతం వాటిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నగరంలోని కొన్నిచోట్ల పశువులు ఇష్టానుసారంగా రోడ్లపైనే ఉంటూ వాహనదారులను, రాకపోకలు సాగించే ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అధికారులు నిత్యం పర్యవేక్షణ లేకపోవడం, అరకొరగా పట్టుకున్నా, వాటిని గోశాలకు తరలించకపోవడంతో  ఈ పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించే ఈ నగరంలో పశువుల గురించి అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. ఇకనైనా అధికారులు జన సంచారం ఉండే ప్రాంతాల్లో పశువులు రోడ్డుకు అడ్డంగా సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.