ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థినీ, విద్యార్థులపై సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్






రవి కిరణాలు,తిరుపతి, జూలై18:-


 ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థినీ, విద్యార్థుల పట్ల బాధ్యతగా ఎంతో అప్రమత్తంగా, వారిని తమ సొంత పిల్లల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో అంత కన్నా ఎక్కువ బాధ్యతగా  వ్యవహరించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉంచుకుని, వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల జాగరూకతతో వ్యవహరించాలని ఆగస్ట్ 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సదరు హాస్టళ్లను, గురుకులాలను సందర్శించి వాటిని మెరుగు పరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు, అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు.


గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో, గురుకులాల్లో ఉన్న పిల్లలను తమ సొంత పిల్లల్లా బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోవాలని, తల్లిదండ్రులు మన వసతి గృహాలపై నమ్మకంతో మన వద్ద ఉంచినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, పారిశుధ్యం మెరుగు పడాలని, వంట గది, ఆహార పదార్థాలను శుభ్రంగా శుచిగా తయారు చేయాల్సి ఉంటుందని, మరుగు దొడ్లు లో రన్నింగ్ వాటర్ ఉండేలా వాటిని సక్రమంగా వాడేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించి పర్యవేక్షించాలని సూచించారు. ఆగస్ట్ 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలను, రెసిడెన్షియల్ పాఠశాలలను సంబంధిత అధికారులు సందర్శించి మెరుగు పరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు, ఇంజనీర్లతో  అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎలాంటి చిన్న పొరపాటు సదరు గురుకుల పాఠశాలల్లో, హాస్టల్లలో జరగడానికి వీలు లేదని ఆదేశించారు. 


ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, రాజ్యలక్ష్మి,  డి సి ఓ పద్మజ, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి చంద్ర శేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి, ఈడి బిసి కార్పొరేషన్ శ్రీదేవి, ఈడి మైనారిటీ కార్పొరేషన్ హరినాథ్ రెడ్డి, డిటిడబ్ల్యు అధికారి మరియు ట్రైకార్ చిత్తూరు మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.



సంక్షేమ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలలపై సమీక్ష విజువల్స్