ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను జూన్‌ 10 లోపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

సమాధాన పత్రాల మూల్యాంకనం మే చివరి నాటికి పూర్తి కానుంది. మూల్యాంకనం అనంతరం ఇతర కార్యకలాపాలను ఐదారు రోజుల్లో పూర్తి చేసి, ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. టెన్త్ మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. జూన్‌ 10 లోపు ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్‌ గా తీసుకుని టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు...!!