- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనీల్ కుమార్
నెల్లూరు, జనవరి 17, (రవికిరణాలు) : ఎస్ఆర్ సి, సిఏఏ, ఎపిఆర్‌కు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ వారు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గత 16 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎస్ఆర్ సికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరాహారదీక్షలో పాల్గొన్న పెద్దలకు, ముస్లిం సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముక్కుసూటిగా రాజకీయాలు చేశారేగాని, ఇష్టానుసారంగా చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఆర్ సి సమస్యకు సంబంధించి ముస్లిం సోదరులకు ప్రతినిధిగా ఉపముఖ్యమంత్రి అంజాద్ మాట్లాడడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఏ మద్దతు ఇవ్వనని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సోదరులు ఏ విధంగా సహకరించారో ముఖ్యమంత్రి మర్చిపోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. ఎస్ఆర్ సికి సంబంధించి ముఖ్యమంత్రి ద్రోహి అని కొందరు మాట్లాడుతుండడం బాధాకరంగా ఉందన్నారు. అందుకు సంబంధించిన జీ.ఓ.ను 2019 ఫిబ్రవరిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఉంచిందని, దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రుద్దడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా ముస్లిం సోదరులు ఉన్నారంటే వారే వెన్నెముక అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. ముస్లిం సోదరులకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకోరని తెలియజేస్తున్నానన్నారు. ఎస్ఆర్ కి సంబంధించి ఎటువంటి చర్యలైనా అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు హంజాహుస్సేనీ, ఎండి. ఖలీల్ అహ్మద్, వేలూరు మహేష్, ఎస్ కె.సమీ, ఎస్ఆర్. ఇంతియాజ్, అతహర్ బాషా, సిద్ధిక్, మునవర్, మీరామొహిద్దీన్, ఫజల్, ముజీర్, జమీర్, మస్తాన్, సుభానీ, బాబాభాయ్, ఫజల్, మైనుద్దీన్, షేక్ హాజీ, తదితరులు పాల్గొన్నారు.