నెల్లూరు, జనవరి 29, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించుటకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డా. పి.అనీల్ కుమార్ అధికారులను ఆదేశించారు.బుధవారం స్థానిక ఇరిగేషన్ అతిధి గృహంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణ గురించి మంత్రి,జిల్లా కలెక్టరు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా వుందని, తద్వారా ప్రజలు యిబ్బంది పడుతున్నారన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై అధికారులకు తగు సూచనలు, సలహాలు యిచ్చారు. ఇటీవల కాలంలో ఆటోల సంఖ్య
అధికంగా వున్నందున నగరంలో పలుచోట్ల వాహనాలు నిలుపుట వలన ప్రజలు యిబ్బంది పడుతూ సకాలంలో వారి గమ్యస్థానాలకు చేరలేకపోతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఆటోలను ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 11.00 గంటల వరకు సాయంత్రం 4.00 గంటల నుండి 7.00 గంటల వరకు నగరంలోకి అనుమతించకపోవుట వలన ట్రాఫిక్ సమస్యను కొంత వరకు నియంత్రివచ్చన్నారు. ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించిన బస్సులు మినీ బైపాలో ఆగుతున్నందు వలన ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు. చిల్డ్రన్స్ పార్కు చివర వున్న ఖాళీస్థలం హైవేకు దగ్గరగా వున్నందున ఆ స్థలంలో బస్సులను నిలుపుకొనుటకు అవకాశం కల్పించిన ఎడల ట్రాఫిక్ సమస్యను కొంత వరకు నియంత్రించవచ్చన్నారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లు, యితర వాహనాలను రాత్రి 9.00 గంటల నుండి ఉదయం 6.00 గంటలలోపు
నగరంలోనికి అనుమతించుట ద్వారా పై సమస్యను అధి గమించే వీలు కలుగుతుందన్నారు. నగరంలో తిరిగే ఆటోలకు ప్రత్యేక రంగును వేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి నగరంలోనికి ప్రవేశించే ఆటోలను నియంత్రించే అవకాశం వుందన్నారు. అదేవిధంగా ఆర్.టి.సి. బస్టాండు, ఆత్మకూరు బస్టాండులు నగరం నడిబొడ్డులో వుండడం వలన జన సమర్థత ఎక్కువగా వుండి ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. అందువలన ఆర్.టి.సి. బస్టాండును హైవేకి దగ్గరగా వున్న అనుకూలమైన స్థలంలోకి మార్చుటకు గల అవకాశాల గురించి అధికారులతో చర్చించారు. జిల్లా రెవెన్యూ అధికారి, మున్సిపల్ కమిషనర్ లను స్థల సేకరణ గురించి చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పోలీసు అధికా భాస్కర భూషణ్, డి.ఆర్.ఓ. జి.మల్లిఖార్జున, మున్సిపల్ కమిషనరు పి.వి.విఎస్. మూర్తి, డిప్యూటి ట్రాఫిక్ కమిషనరు సుబ్బారావు, పబ్లిక్ హెల్త్ ఎస్.ఇ. ఇమాం మొహిద్దీన్, ఆర్.అండ్.బి.ఎస్.ఇ. తదితర అధికారులు పాల్గొన్నారు.