శ్రీసిటీని సందర్శించిన అరుణాచల్ ప్రదేశ్ 'ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్' విద్యార్థులు

రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ, మార్చి 01, 2023:

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవతో 'ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్' యువసంఘం కార్యక్రమంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఎన్ ఐ టి, ఇతర విద్యాసంస్థల నుంచి 28 మంది విద్యార్థులు, అధ్యాపకులు బుధవారం శ్రీసిటీని సందర్శించారు. ఐదు రోజుల ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా చివరి రోజు ఇక్కడకు వచ్చిన విద్యార్థులకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు.

విద్యార్థులతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్న ఆయన, దేశ సమైక్యతను చాటిచెబుతూ దేశంలోని విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే ఈ కార్యక్రమానికి శ్రీసిటీని ఎంపిక చేయడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నాం అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ స్ఫూర్తికి శ్రీసిటీ చక్కని ఉదాహరణగా అభివర్ణించారు. భారత్ తో సహా 28 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటుతో దేశ విదేశాలకు చెందిన ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్న ఈ ప్రాంతం వివిధ భాషలు సంస్కృతులకు నిలయంగా మారిందన్నారు. భవిష్యత్తులో దేశంలో విభిన్న ప్రాంతాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించేందుకు విద్యార్థులకు ఈ కార్యక్రమం అత్యంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.   

ముఖాముఖిలో ఎంతో ఆసక్తితో శ్రీసిటీ గురించి పలు అంశాలను తెలుసుకున్న విద్యార్థులు, అనంతరం శ్రీసిటీ పరిసరాలను తిలకించారు. ఎన్ హెచ్ కె స్ప్రింగ్స్, ఎంఎండి హెవీ మెషిన్స్, హంటర్ డగ్లస్ పరిశ్రమలను సందర్శించి, అక్కడ ఉత్పత్తులు, పని వాతావరణాన్ని పరిశీలించారు.

ప్రపంచ శ్రేణి సదుపాయాలు, 200 కు పైగా పరిశ్రమలు, చక్కని వాతావరణం తమనెంతగానో ఆకట్టుకుందని ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ అధ్యయనానికి, భవిష్యత్ ప్రణాళికలకు ఈ పర్యటన ఎంతో ఉపయోగకరమన్న వారు, తమకు ఆతిధ్యమిచ్చిన శ్రీసిటీ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా, "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" అనేది భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన నూతన పథకం. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సాంస్కృతిక సంబంధాల ద్వారా ఐక్యతను పెంపొందించడం, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. ఇందులో అంతర్భాగమైన యువసంఘం కార్యక్రమం ద్వారా దేశంలోని ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపి ఆయా ప్రాంతాలలో పర్యాటకం, సంప్రదాయాలు, సుస్థిర అభివృద్ధి, టెక్నాలజీ, ప్రజల మధ్య అనుసందానం వంటి ఐదు ప్రధాన అంశాలలో అవగాహన కల్పిస్తారు. పరిశ్రమలు, పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించి వారిని ఉత్తేజితులను చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి ఐఐటీ ని ఈ కార్యక్రమానికి నోడెల్ ఇన్స్టిట్యూట్ గా గుర్తించారు.