బీసీలను మొదట రాజకీయంగా చైతన్యవంతం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ - మంత్రి కొడాలి నాని
November 02, 2020
State Civil Supplies Minister Kodali Nani recalled the late Chief Minister NT Rama Rao in the House of the ruling YSR Congress Party BCs.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల సభలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును గుర్తు చేసుకున్నారు. బీసీలను మొదట రాజకీయంగా చైతన్యవంతం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన బీసీల అభినందన సభలో మాట్లాడుతూ.. బీసీలంటే ఒకప్పుడు ఎన్టీఆర్ పేరు వినపడేదన్నారు. తన కోసం ఎంతో చేసిన బీసీల కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. అప్పట్లో బీసీలంతా ఎన్టీఆర్ వెంట నడిచారన్నారు.
అలాంటి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కొందరు లాక్కున్నారని చంద్రబాబుపై కొడాలి నాని ఫైరయ్యారు. ఎన్టీఆర్ తర్వాత బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా మార్చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ తర్వాత వైఎస్సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని కొడాలి నాని కొనియాడారు. బీసీలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు.