పల్లిపట్టు నాగరాజును సత్కరించిన  శ్రీసిటీ ఎండీ   

రవి కిరణాలు న్యూస్ శ్రీసిటీ, సెప్టెంబర్ 28, 2022:

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2022కి ఎంపికైన పల్లిపట్టు నాగరాజును శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు. బుధవారం శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగరాజును సన్మానించి గౌరవించారు. శ్రీసిటీ పరిసర ప్రాంతానికి చెందిన నాగరాజు అత్యున్నత సాహిత్య గౌరవానికి నామినేట్ కావడం, జాతీయ ఖ్యాతిని పొందడం ఈ ప్రాంత సాహిత్యాభిమానులందరికీ  చాలా సంతోషకరమైన విషయంగా డా. రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సాహిత్యరంగంలో అత్యుత్తమ జాతీయ పురస్కారం 'జ్ఞానపీత్' అవార్డు నాగరాజును దక్కాలని ఆకాంక్షించారు.  

ఈ కార్యక్రమానికి హాజరైన హిందూ దినపత్రిక తిరుపతి ప్రత్యేక ప్రతినిధి ఎడి రంగరాజన్ మాట్లాడుతూ నాగరాజు విలక్షణమైన సాహిత్య శైలిని కొనియాడారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన మత్స్యకారులు, చర్మకారులు, పారిశుద్ధ్య కార్మికులను రచనా వస్తువులుగా ఎంచుకుని, సమాజానికి వాళ్ళు ఎలా ఉపయుక్తమో వివరించటం అద్భుతమని పేర్కొన్నారు.

తనకు లభించిన గౌరవం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన నాగరాజు, తన స్వంత ప్రాంతంలో, ప్రముఖ శ్రీసిటీ పారిశ్రామిక నగరంలో లభించిన ఈ గౌరవాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన కవిత్వం ద్వారా సమకాలీన సమస్యలపై గొంతు విప్పడమే కాకుండా, వాటిని పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్న భావన కలుగుతోందంటూ, తన రచన 'యాలై పూడిసింది' గురించి వ్యాఖ్యానించారు.

సత్యవేడు మండలం రాజగోపాలపురానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు నాగరాజు సమకాలీన సామాజిక సమస్యలను ప్రస్తావించే 52 కవితల సంకలనం 'యాలై పూడిసింది' అనే తెలుగు రచనకు గాను పురస్కారానికి ఎంపికయ్యారు.

శ్రీసిటీ ప్రెస్ రిలేషన్స్ ఆఫీసర్ డి.రవి స్వాగత సందేశంతో సన్మాన సభ ప్రారంభం కాగా, శ్రీసిటీ పీఆర్వో మరియు ప్రముఖ తెలుగు కథా రచయిత పల్లేటి బాలాజీ నాగరాజు గారిని పరిచయం చేస్తూ ఆయన సాహిత్య రచనలు, విశిష్ట శైలి గురించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో సత్యవేడు, వరదయ్యపాలెం, తడ విలేకర్లు పాల్గొన్నారు.