శ్రీసిటీలో డా. సాయికృష్ణ యాచేంద్ర ‘సంగీత గేయధార’ కార్యక్రమం

రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ, ఫిబ్రవరి 18, 2023: 
ప్రముఖ పండితులు, గాయకులు, విఖ్యాత వెంకటగిరి వెలుగోటి రాజ వంశీకులు, శ్రీ వెంకటేశ్వర  భక్తి  చానెల్ (ఎస్వీబిసి) చైర్మన్ డా. వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర ‘సంగీత గేయధార’ కార్యక్రమం, శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహితీ వేదిక శ్రీవాణి ఆద్వర్యంలో శనివారం శ్రీసిటీలో జరిగింది. ఇది సాయికృష్ణ యాచేంద్ర నిర్వహించిన 403వ గేయధార.

డా. యాచేంద్రకు, ప్రుచ్చకులకు, కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. కార్యక్రమానికి సమన్వయ కర్తగా కందనూరు మధు వ్యవహరించగా, ప్రుచ్చకులుగా పాల్గొన్న శ్రీమతి శోభా రాజా, శ్రీమతి కుసుమ కుమారి, పణతుల సుభ్రమణ్యం, జేకే రెడ్డి, వెంకట రామజోగి, కామేశ్వర రావులను శ్రీసిటీ ప్రతినిధి పల్లేటి బాలాజీ సభకు పరిచయం చేశారు.

సంగీత సాహిత్య ప్రధానంగా సాగిన  ఈ  కార్యక్రమం అష్టావధానం లాంటి ప్రక్రియ. పృచ్చకులు సూచనలకు అనుగుణంగా గేయ అవధాని డా. యాచేంద్ర అప్పటికప్పుడే ఆశువుగా రాగతాళ యుక్తంగా గేయాలను ఆలపించారు. ఆది దంపతులైన శివపార్వతుల దాంపత్య వైశిష్ఠాన్ని, ఆర్ధ నారీశ్వర తత్వాన్ని వస్తువుగా శ్రీమతి శోభా రాజా సూచించగా, పాటని కల్యాణి రాగంలో చతురస్ర గతిలో పాడమని సుభ్రమణ్యం నిర్దేశించారు. సావిత్రి, జమున, భానుమతి, కాంచన పదాలను ఉపయోగిస్తూ పార్వతీ దేవిని కీర్తిస్తూ పాటను రచించి గానం చేయమని శ్రీమతి కుసుమ కుమారి కోరగా, ఆ పాటను షణ్ముఖ ప్రియ రాగంలో, తిశ్రగతిలో పాడమని  సుభ్రమణ్యం సూచించారు. శివరాత్రిని పురస్కరించుకుని గిరిజా కల్యాణం ఇతివృత్తంగా, 'జరుగుతున్న, విచ్చేసిన, గణనాధుడు, దేవతులు'  వంటి పదాలను నిషేధిస్తూ గానం చేయమని కామేశ్వర రావు కోరగా, ఆ పాటను మధ్యమావతి రాగంలో చతురస్ర గతిలో పాడమని సుభ్రమణ్యం నిర్దేశించారు. గేయావధాని ఆలోచనా స్రవంతికి అంతరాయం కల్గిస్తూ మధ్య మధ్యలో జేకే రెడ్డి ప్రస్తావించిన మంచి ముచ్చట్లు రక్తి కట్టించాయి.

శ్రీసిటీ సృష్ఠి కర్త రవీంద్ర సన్నారెడ్డి సాధించిన విజయాన్ని మెచ్చుకుంటూ, ఆయన తండ్రి ఇచ్చే అశీస్సులను గేయ రూపంలో గానం చేయమని, 'మానవుడే మహనీయుడు' అన్న పల్లవిని వెంకట రామజోగి సూచించారు. వేలమందికి ఉపాధిని కల్పిస్తూ ఆధునిక  దేవాలయంగా పిలువబడుతున్న శ్రీసిటీని కీర్తిస్తూ ఒక మనోహర గేయాన్ని ఆలపించారు. ఛివర్లో తరిగొండ వెంగమాంబ రచించిన  లాలిపాటను పాడారు.  

భావసౌందర్యం, గానమాధుర్యం జట్టు కడుతూ, సంగీత సాహిత్యాలు చెట్టా పట్టాలు వేసుకుంటూ మనోహరంగా సాగిన 'సంగీత గేయధార’, రసజ్ఞులను, సాహితీ ప్రియులను ఎంతగానో మెప్పించింది.