ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి
డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):
నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, షాపు రూముల బాడుగల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాలను సాధించాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం వారాంతపు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో వసూళ్ల కొరకు పర్యటించాలని సూచించారు. గత వారములో నిర్దేశించిన విధముగా కోటి రూపాయల పన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన సమయంలోపు చెల్లించని పక్షంలో తాగునీటి కుళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు తెలియజేయాలన్నారు. అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ పేమెంట్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను అందుకోని కార్యదర్శులఫై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, అలాగే కొత్తగా నిర్మించిన భవనములు, అదనంగా నిర్మించిన అంతస్తులు,మార్పులను, ఖాళీ స్థలము లను గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకొని రావలసిందిగా ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.