శ్రీసిటీని సందర్శించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు






రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :  కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఐఏఎస్, శనివారం విడివిడిగా శ్రీసిటీని సందర్శించారు. 

దుర్గా శంకర్ మిశ్రాకు శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రత్యేకతలు, ప్రగతి మరియు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధిపై దాని ప్రభావం గురించి ఆయనకు వివరించారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను మిశ్రా సందర్శించారు మరియు కొన్ని పరిశ్రమలకు వెళ్ళి అక్కడ ఉత్పత్తులను, ఇతర పనులను పరిశీలించారు. విశాల స్థలం, మంచి మౌళిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భారీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీని అభివృద్ధి చేయడంలో శ్రీసిటీ యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.

శ్రీసిటీకి విచ్చేసిన పోలా భాస్కర్ కు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఆయన క్రియా యూనివర్సిటీని సందర్శించారు.  క్రియా వైస్ ఛాన్సలర్ డాక్టర్ మహేశ్ రంగరాజన్, గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు స్కూల్ ఆఫ్ ఇంటర్‌వూవెన్ ఆర్ట్స్ & సైన్సెస్ విభాగాల ముఖ్య అధ్యాపకులతో ఆయన  చర్చించారు. క్రియా విద్యావిధానం, పాఠ్యాంశాల గురించి వివరించిన వైస్ ఛాన్సలర్, కళలు శాస్త్రాలను మిళితం చేసిన ఒక ప్రత్యేకమైన ‘ఇంటర్‌వొవెన్ లెర్నింగ్’ విధానం విద్యార్థులకు అన్వేషణ శక్తిని, సబ్జెక్టులపై ఆసక్తిని పెంచుతుందన్నారు. 

క్రియా యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ కు కృతజ్ఞతలు తెలిపిన పోలా భాస్కర్, ఉన్నత విద్యలో భిన్నమైన విధానాన్ని తీసుకువచ్చినందుకు యూనివర్సిటీ బృందాన్ని ప్రశంసించారు - ఇంటర్‌వూవెన్ లెర్నింగ్ ద్వారా ఆలోచనలు, కళలు, విజ్ఞానాలతో గతాన్ని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తు కోసం విద్యార్థులను సంసిద్దులను చేస్తుందన్నారు.