శ్రీసిటీ ఎండీకి శుభాకాంక్షలు తెలిపిన సత్యవేడు, సూళూరుపేట ఎమ్మెల్యేలు

రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ:

విక్రమ సింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ గ్రహీత శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య  శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం శ్రీసిటీలో ఆయనను వేరువేరుగా కలసిన ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ప్రాంతాన్ని 200 పైచిలుకు పరిశ్రమలు, వేలాది ఉద్యోగాల కల్పనతో ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన శ్రీసిటీ సృష్టికర్తకు డాక్టరేట్ తో సముచిత గౌరవం దక్కిందంటూ ఈ సందర్భంగా వారు రవీంద్ర సన్నారెడ్డిని ప్రశంసించారు.