సప్త ఖండ అవధాన సాహితీ ఝరి అంగరంగంగా విజయోత్సవ సభ
సప్త ఖండ అవధాన సాహితీ ఝరి అంగరంగంగా విజయోత్సవ సభ
సప్త ఖండాలలోని వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సప్తఖండ అవధాన సాహితీ ఝరి విజయోత్సవ సభ, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, జీవన సాఫల్య సాహితీ పురస్కార సభ 29 మే 2022 న శ్రీ ప్రణవ పీఠం లో అత్యద్భుతంగా జరిగాయి. ప్రణవ పీఠం స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు అమెరికా, టెక్సాస్ నుండి శ్రీమతి కృష్ణ పద్మ తెలియచేసారు. సప్తఖండాల నుండి వివిధ దేశాల సాహిత్య నిపుణులు పాల్గొని సాహిత్య వేదిక అంగరంగంగా అలరించింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న నానుడితో సభ జయప్రదంగా ముగిసింది.
ఈ అవధానంలో ఆస్ట్రేలియా ఖండం నుండి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ తరఫున శ్రీ గోవర్ధన్ మల్లెల గారు, దక్షిణ ఆఫ్రికా ఖండం నుండి దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ సీతారామరాజు గారు, ఐరోపా ఖండం నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(టాళ్) వైస్ చైర్మన్ మరియు కోశాధికారి శ్రీ రాజేష్ తోలేటి గారు, ఆసియా ఖండం నుండి సింగపూర్ శ్రీ సాంస్మృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రత్నకుమార్ కవుటూరి గారు, ఖతార్ దేశం నుండి తెలుగుకళా సమితి అధ్యక్షులు శ్రీ తాతాజీ ఉసిరికల గారు, శ్రీమతి సౌమ్య కంతేటి గారు, మలేషియా తెలుగు అసోసియేషన్ నుండి శ్రీమతి సత్యాదేవి మల్లుల గారు, ఉత్తర అమెరికా ఖండం, అమెరికా నుండి శ్రీ రామచంద్రరావు తల్లాప్రగడ గారు, కెనడా నుండి తెలుగుతల్లి కెనడా మాస పత్రిక ఎడిటర్ శ్రీమతి లక్ష్మీ రాయవరపు గారు, దక్షిణ అమెరికా ఖండం, పెరూ దేశం నుండి శ్రీ రంగారెడ్డి బద్దం గారు పృచ్ఛకులుగా పాల్గొనగా, ఆస్ట్రేలియా ఖండం నుండి శ్రీ అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు అవధాన సంచాలకత్వం చేసారు.
తెలుగు భాషకి అత్యున్నత వైభవం అయిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" అనే కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. మూడు భాషలలో సహస్రావధానం చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ప్రతి మాసం ఒక్కొక్క ఖండం చొప్పున దాదాపు 20కి పైగా దేశాలు పాల్గొనగా, అంతర్జాలం లో 13 అష్టావధానాలు పూర్తి చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, మే 29 వ తేదీన అంతర్జాలం వేదికగా సప్తఖండాల నుండి తెలుగు ప్రతినిధులుగా 11 మంది పృచ్ఛకులు పాల్గొనగా 14 వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేసారు.
కళాబ్రహ్మ శిరోమణి డా|| శ్రీ వంశీ రామరాజు గారు, ప్రసిద్ధ తెలుగు సినీ గేయ రచయిత శ్రీ భువన చంద్ర గారు, కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మా శర్మ గారు, ప్రముఖ కవి, సినీ గేయరచయిత శ్రీ వడ్డేపల్లి కృష్ణగారు విశిష్ట అతిథులుగా శ్రీ ప్రణవ పీఠానికి విచ్చేయగా, ప్రముఖ చలన చిత్ర నటులు శ్రీ తనికెళ్ళ భరణి గారు, శ్రీ వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ చిట్టెన్ రాజు గారు(అమెరికా), శ్రీమతి ఘంటసాల పార్వతి గారు, పెరుంగో సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ స్వామి నారాయణ గారు (కెనెడా) ... తదితరులు జూమ్ ద్వారా సభలో పాల్గొన్నారు.
ఈ విజయోత్సవ సభ లో సప్తఖండ అవధాన సాహితీ ఝరి ప్రత్యేక సంచిక ఆవిష్కరణతో పాటు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వంశీ ఆర్ట్ థియేటర్స్ - ఇంటర్నేషనల్, ఇండియా; శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు శుభోదయం గ్రూపువారు సంయుక్తంగా నిర్వహిస్తున్న సద్గురు ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన సద్గురు ఘంటసాల శతజయంతి వంశీ - శుభోదయం అంతర్జాతీయ జీవిత సాఫల్య సాహితీ పురస్కారం- 2022 బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
ఎంతో రసవత్తరంగా, కన్నుల పండుగగా సాగిన ఈ సభని వీక్షించిన సాహితీ ప్రియులు, చాలా కాలం తరువాత చక్కని కార్యక్రమం తిలకించామని హర్షం వ్యక్తపరిచారు.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీ ప్రణవ పీఠం స్థాపించారు. ప్రవచన కర్తగా వారు సుప్రసిద్ధులు. సంగీత, సాహిత్యాలలో సమప్రతిభ, తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో సమ పాండిత్యం కలిగిన వారు. తెలుగు భాషని, సంస్కృతినీ నిలబెట్టడానికి వీరు ఆధ్యాత్మిక యాత్రలని శిష్యులతో చేస్తుంటారు.
ఏడు ఖండాల్లో జరిగిన ఈ 14 అవధానాలతో కలుపుకుని ఇప్పటికి 1244 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు, తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహాసహస్రావధానం చేసారు వద్దిపర్తి వారు. వారి అసాధారణమైన ప్రతిభని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు గుర్తించాయి. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంకల్పం నిరాటంకంగా సాగాలని, తెలుగుభాష మరింత ఖ్యాతిని గడించాలని ఆశిద్దాం.
మన తెలుగు పతాకాన్ని ప్రపంచం అంతా రెప రెపలాడిద్దాం….