గత ప్రభుత్వానిది చెత్త పాలన -మంత్రి నారాయణ 5 వేల మందితో భారి ర్యాలీ స్వచ్చాంద్ర -స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి విశేష స్పందన
గత ప్రభుత్వానిది చెత్త పాలన -మంత్రి నారాయణ 5 వేల మందితో భారి ర్యాలీ
స్వచ్చాంద్ర -స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి విశేష స్పందన
స్వచ్చాంధ్ర -స్వర్ణాంధ్ర నినాదాలతో హోరెత్తిన సింహపురి .
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 19 :
స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.ఐదేళ్లపాటు గతప్రభుత్వం చెత్త పన్నుతో పాటు చెత్త పాలన అందించిందని ఆరోపించారు .10 లక్షల కోట్లు అప్పులతో పాటు ,85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి మిగిల్చి వెళ్లారని దుయ్యబట్టారు.ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో దాదాపు 5000 మంది విద్యార్థిని విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలతో నెల్లూరు నగరంలోని వి ఆర్ సి సెంటర్ నుండి నర్తకి సెంటర్ వరకు భారీ స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. “ఈ - వేస్ట్ దహనం కాదు నిర్వహణ కావాలి, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, ఈ - వేస్ట్ ను మిగతా చెత్తతో కలప వద్దు, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టండి - ప్రకృతిని రక్షించండి ” వంటి నినాదాలతో విద్యార్థులు కదం తొక్కారు. వేలాదిగా హాజరైన విద్యార్థులు,ఇతరులతో మంత్రి నారాయణ స్వచ్చతా ప్రతిజ్ఞ చేయించారు.నెల్లూరు నగరపాలక సంస్థకు కేటాయించిన రోడ్లను శుభ్రం చేసే యంత్రాలను మంత్రి ప్రారంభించారు.తోలుత మంత్రి నారాయణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డిలతో కలసి అల్లిపురంలోని డంపింగ్ యార్డ్ వద్ద బయో మైనింగ్ యూనిట్ ను ప్రారంభించారు.అనంతరం ఏడవ డివిజన్ లోని బి వి యస్ పాఠశాల వద్ద ఇ - వ్యర్ధాల కలెక్షన్ సెంటర్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. స్వచ్చతా ర్యాలీ ముగింపు సందర్బంగా నర్తకి సెంటర్ లో స్వర్ణాంద్ర, స్వచ్చాంద్ర గురించి కళాశాల విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడించి ఉత్సాహపరిచారు.అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీ ని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యం అన్నారు .
మన మనసు,ఇల్లు, పరిసరాలు స్వచ్చంగా ఉన్నప్పుడే స్వచ్చాంద్ర సాధ్యపడుతుందన్నారు. స్వచ్చాంద్ర గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించేందుకు ముఖ్యమంత్రి నుండి స్థానిక కార్పొరేటర్ వరకు అందరూ విధిగా ప్రతి నెలా మూడవ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ఏప్రిల్ నెలలో ఇ - వ్యర్ధాల రీసైక్లిoగ్ అనే ధీమ్ తో స్వచ్చతా దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల్లో, ఇళ్లలో పేరుకుపోయిన పాత టీవీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను స్థానికంగా ఏర్పాటుచేసిన కలెక్షన్ సెంటర్లలో అందజేయాలన్నారు. వాటిని రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులను తయారుచేసే అవకాశం ఉంటుందన్నారు. ఇ - వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. గత ప్రభుత్వం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్తను సైతం అందించిందని, ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు రాబోవు అక్టోబర్ 2 నాటికి రాష్ట్రం లోని చెత్తను పూర్తి స్థాయిలో తీసివేస్తామన్నారు. ఇందుకు ప్రజలందరి సంపూర్ణ సహకారం అవసరమన్నారు. రాష్ట్రంలోని123 మున్సిపాలిటీలకు అధునాతన యంత్రాలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా అమృత్ పధకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి త్రాగు నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. గతప్రభుత్వం మున్సిపాలిటీల నిధులను కూడా దారి మళ్లిందన్నారు .పన్నుల ద్వారా వచ్చే మొత్తాన్ని మున్సిపాలిటీల అభివృద్ధికే వెచ్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు .ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ వైఓ నందన్, హెల్త్ ఆఫీసర్ చైతన్య, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, టిడిపి నగర్ అధ్యక్షులు మామిడాల మధు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు