అమరావతి: ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పైలెట్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. రేపు అనగా శుక్రవారం నాడు ఏలూరులో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 1,059 వ్యాధులకు వైద్య సేవలు అందుతున్నాయి. అదనంగా మరో వెయ్యి వ్యాధులకు అందించేందుకు పైలెట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా మొత్తం 2059 వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు అమలుతో ఎదురయ్యే ఇబ్బందులను సర్కార్ గుర్తించింది. కాగా.. ఏప్రిల్‌ నుంచి మిగిలిన అన్ని జిల్లాలకు వర్తించనుంది.
ఇదిలా ఉంటే.. జగన్‌ పర్యటన సందర్భంగా స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రామకృష్ణలతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ అమలుకు జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.