యోగతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
యోగతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
• యువత తమ జీవితంలో యోగను భాగం చేసుకోవాలి
• ఘనంగా 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం
• ఆకట్టుకున్న ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల యోగ ప్రదర్శన
• భారతదేశం ఆకారంలో విద్యార్థుల మానవహారం
నెల్లూరు, 21 జూన్ 2024
యోగతోనే శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమౌతుందని, ఈ నేపథ్యంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతరం యోగను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని, రోజుకు కనీసం ఓ గంట యోగ సాధన కొనసాగించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగ మిత్రమండలి - నెల్లూరు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం - నెల్లూరు, నెహ్రూ యువకేంద్ర, పి.ఎం.పి. అసోసియేషన్, రుడ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు డి.కె.జూనియర్ కళాశాల వసతిగృహంలో యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమ అనంతరం యోగ గురించి అన్ని రంగాల ప్రజలకు అవగాహన కల్పించే సంకల్పంతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర కార్యాలయం, నెల్లూరు మరియు ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ - నెల్లూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దాదాపు 10 రోజుల పాటు ఇథాకా ఇంటర్నేషనల్ స్కూల్ జి.ఎం. శ్రీ సంగం జీవన్, ప్రిన్సిపల్ శ్రీ రవికుమ్మమూరు, యోగ శిక్షకురాలు శ్రీమతి పద్మావతి పర్యవేక్షణలో కఠోర పరిశ్రమ ద్వారా విద్యార్థుల యోగాసనాలతో చేసిన అద్భుతాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతదేశ రూపులో విద్యార్థులతో ఏర్పాటు చేసిన మానవ హారం విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజలు యోగ వైపు ఆకర్షితులు అవుతారని భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దొడ్ల కౌసల్యమ్మ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఎ.శ్రీనివాసులు గారు మాట్లాడుతూ... నిత్యం యోగ సాధన ద్వారా అనేక రుగ్మతలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి, జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు యోగ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
గీతా వైభవ్ ట్రస్ట్ కు చెందిన బాషా గురూజీ మాట్లాడుతూ... భారతీయ సనాతన ధర్మం యోగకు ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని, గత 10 సంవత్సరాలుగా ప్రపంచం ఈ స్ఫూర్తిని గుర్తించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం ద్వారా చక్కని ప్రయోజనాలు పొందాలని సూచించారు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి యోగ చక్కని సాధనమని అభిప్రాయ పడ్డారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార సహాయకులు శ్రీ హరికృష్ణ, యోగమిత్ర మండలి సభ్యులు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, శ్రీ రవీంద్ర, యోగ శిక్షకులు శ్రీమతి పద్మావతి, శ్రీ నాగూర్ గురూజీ, పి.హెచ్.పి. జిల్లా అధ్యక్షులు శ్రీ శాఖవరపు వేణుగోపాల్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ రసూల్, న్యాయవాది శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.