తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
ఈ ప్రపంచంలో నిన్ను నీ తల్లిదండ్రులు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరని డాక్టర్ లహరి పేర్కొన్నారు. బుధవారం ఉదయం నెల్లూరు బాలాజీ నగర్ ఏసి బ్రాంచ్ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూలు నందు ఫ్యామిలీ ప్యారడైజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబంలో అమ్మా, నాన్న తోడబుట్టినవారితో ఎల్లప్పుడూసత్సంబంధాలు ఏర్పర్చుకుని ఉండడంవల్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు వెల్లివిరిసి మన కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబంగా నిలుస్తుందని తెలియజేశారు. నెహ్రూ యువకేంద్ర డిస్ట్రిక్ యూత్ కోఆర్డినేటర్ ఆకుల మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ యాంత్రిక జీవనంలో, పోటీ ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఒకరైతే ముద్దు, ఇద్దరైతే వద్దు, ఆపై ఇక వద్దు అంటూ ఆ ఇద్దరూ కూడా ఒకే కుటుంబంలా ఉండలేక ఎవరికివారు యమునా తీరు అన్న చందంగా ఉమ్మడి కుటుంబాలను కనుమరుగు చేస్తుండడం ఎంతో బాధాకరం. చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఆకుల కొత్తూరులో మేమంతా ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నామని వివరించారు. అనంతరం విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయించి తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో విద్యార్థులను దీవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె ఎస్ వి కిరణ్ కుమార్, ఆదిత్య విద్యాసంస్థల అధినేత ఆచార్య ఆదిత్య, యోగా మాస్టర్ ఎస్ రవీంద్ర. డాక్టర్ ఎస్. ఫెరోజ్, డీన్ శ్రీనివాసులు, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, గౌరవాధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.