ఏపీలో ఒమిక్రాన్..న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ? నైట్ కర్ఫ్యూ ?
ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం ఉన్నతాధికారులతో సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడంతో పాటు నైట్ కర్ఫ్యూ విధించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడిచేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకునే ఆలోచనలో లేనట్టు కనిపిస్తోంది. దీంతో ఆంక్షలు తప్పేలా కనిపించట్లేదు.
మరోవైపు…దేశంలో కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొన్నటి వరకు 17 రాష్ట్రాలకే పరిమితమైన వైరస్ తాజాగా మరో రెండు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరాయి. రోజుకు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.