అన్ని వర్గాలకు విద్య చేరువైతేనే దేశాభివృద్ధి సాధ్యం

117 జి. ఓ ను రద్దు చేయాలి





స్కూళ్లలో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి

ఉర్దూ మీడియం స్కూళ్లకు ఉర్దూ టీచర్లను కేటాయించి బలోపేతం చేయాలి

ఆవాజ్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయాలు

అన్ని వర్గాల ప్రజలకు విద్య అందితేనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం నగరంలోని మినీ బైపాస్ వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రఫీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ 117 జీవోను గత ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ జీవో వలన దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేసిందన్నారు. తద్వారా జిల్లాలో కొన్ని  స్కూళ్లు మూతపడ్డాయని చాలామంది విద్యకు దూరమయ్యారన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తగిన స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడంతో  విద్యార్థులకు మెరుగైన చదువు అందడం లేదన్నారు. సిఐటియు జిల్లా నాయకులు సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రతి సారి విద్యా వ్యవస్థను  నాశనం చేస్తున్నాయని తద్వారా పేద బడుగు, బలహీన, వర్గాల పిల్లలు చదువుకు దూరం  అవుతున్నారన్నారు. పేదలను చదువుకు దూరం చేసే  చర్యలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా  ఉందన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమారి, మస్తాన్ బి మాట్లాడుతూ మోడల్ స్కూల్ ల పేరుతో మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో స్కూలు పెడితే విద్యార్థినులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. అందువలన ప్రస్తుతం స్థానికంగా ఉన్న స్కూళ్ల ద్వారా మెరుగైన విద్య కు కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బిపి నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారిన ఉపాధ్యాయుల భర్తీ విషయంలో చిన్నచూపు చూస్తున్నారని అందువలన వీలైనంత త్వరగా డీఎస్సీ ఇచ్చి ఉపాధ్యాయులను భర్తీ చేయాలని అప్పుడే విద్యార్థులకు మెరుగైన విద్య అందించే అవకాశాలు ఉందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జీవన్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మార్పులు కేంద్రం ఏ విధంగా అయితే చెబుతుందో ఆ విధానాలే రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఈ విధానాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ జిల్లా నాయకులు నవీద్ మాట్లాడుతూ ఉర్దూ భాష దేశంలోనే ప్రాచీన భాష అని  తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.  ఉర్దూ మీడియం ఉన్న స్కూల్లో ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించాలన్నారు. ఉర్దూ భాషను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు నబీవుల్లా మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా  117 జీవోను ఖచ్చితంగా రద్దు చేయాల్సిందేనని అన్నారు. మరో రిటైర్డ్ ఎంప్లాయి మునీర్ మాట్లాడుతూ మొట్టమొదటి కేంద్ర విద్యా శాఖ మంత్రి ఏర్పాటు చేసిన విద్యా వ్యవస్థ బలమైనదని  తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ బలమైన విద్యా వ్యవస్థను నాశనం చేసేదానికి ఈ కొత్త రకం జీవోలన్నీ తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ రియాజ్, షేక్ చాన్ బాషా, షేక్ జానీ బాషా, షేక్ మునీర్ భాష, సయ్యద్ రవూఫ్, షేక్ నాయబ్, నగర నాయకులు సమీవుల్లా, షేక్ సలాం, ఇతర ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.