నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా
నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు శస్త్ర చికిత్సలు
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కూలీకి అరచేతి పక్షవాతం.. రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశం
ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు జింకా రెడ్డి శేఖర్ తీర్పు
నెల్లూరు, మేజర్ న్యూస్ : వైద్యుల నిర్లక్ష్యంపై శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు ఇచ్చారు. ఓ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించి అరచేతి పక్షవాతానికి కారణమైనట్లు నిర్ధారించి బాధితుడికి రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలంటూ నెల్లూరు నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే..
నెల్లూరు కొడవలూరుకు చెందిన షేక్ మక్సూద్ భవన నిర్మాణ కూలిగా జీవనం సాగించేవాడు. 2009 నవంబరు 28న పని చేస్తుండగా కింద పడటంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన తరువాత ఓ వైద్యుడు శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచించగా డిసెంబర్ 1న లాంగ్ బోన్ ఫ్రాక్చర్ కు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 2009 డిసెంబర్ 12న డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ తరువాత విపరీతమైన చేతి వాపు, నొప్పితో ఫిబ్రవరి నెలలో నారాయణ హాస్పిటల్ కు వెళ్ళగా పరీక్షించిన తరువాత బాధితుడికి రేడియల్ నరాల యొక్క న్యూరోప్రాక్సియా వచ్చిందని నిర్ధారించారు. ఇంకో సారి శస్త్ర చికిత్స చేయాలని సూచించగా బాధితుడు 2010 ఫిబ్రవరి 26న మరలా రెండవ సారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. రెండవ సారి శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత కూడా ఫలితం లేకపోయింది. బాధితుడికి అరచేతి పక్షవాతం వచ్చింది. ఆ తరువాత అదే ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
వినియోగదారుల కోర్టులో విచారణ..
మొదటి శస్త్ర చికిత్స తరువాత వైద్యుడు సూచించిన జాగ్రత్తలు, నియమాలు పాటించకపోవడంతో బాధితుడుకి న్యూరో ప్రాక్సియా వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్, రెండవ శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు కోర్టుకు తెలిపారు. రెండవ శస్త్ర చికిత్సకు ముందు బాధితుడికి శస్త్ర చికిత్స తరువాత కాంప్లికేషన్స్ వస్తాయని వివరించి హై రిస్క్ కన్సెంట్ ఫార్మ్ మీద బాధితుడి, అతని భార్య వద్ద నుండి సంతకం తీసుకున్న తర్వాతే చికిత్స చేశామని, శస్త్ర చికిత్స చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్నామని అయినా కాంప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. న్యాయమూర్తి కేసు షీట్స్, ఆపరేషన్ నోట్స్, హై రిస్క్ కన్సెంట్ ఫార్మ్ లను కోర్టులో సమర్పించమని అడగగా ఆసుపత్రి యాజమాన్యం సమర్పించలేదు. మొదటి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు విచారణకు హాజరు కాలేదు. ఆసుపత్రి యాజమాన్యం బాధితుడిపై చేసిన నిందలను డాక్యుమెంట్ల ద్వారా నిరూపించలేదని తీర్పులో పేర్కొన్నారు.
బాధితుడు కోర్టుకు సమర్పించిన మెడికల్ ఒపీనియన్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వికలాంగుల సర్టిఫికెట్, గుర్తింపు కార్డును పరిశీలించిన న్యాయమూర్తి రెడ్డి శేఖర్ ఆపరేషన్ తరువాత వైద్యుల నిర్లక్ష్యంతో వచ్చిన ట్రామా వల్లనే బాధితుడికి అరచేతి పక్షవాతం వచ్చిందని నిర్ధారించాడు.
రూ.5 లక్షలు జరిమానా
బాధితుడు నారాయణ ఆసుపత్రిలో మందులకు, శస్త్ర చికిత్స తరువాత చేసుకున్న ఫిజియోథెరపీకి రూ.1,490లు చెల్లించినట్లు బిల్లులు సమర్పించాడు. దీంతో బాధితుడి వద్ద నుంచి తీసుకున్న రూ.1,490,
శారీరక, మానసిక వేదనకుగాను బాధితుడికి రూ.5 లక్షలు.. మొత్తం రూ.5,01,490లు నష్ట పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు బాధితుడికి చెల్లించాలని శుక్రవారం నెల్లూరు నారాయణ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. 45 రోజుల్లో పరిహారం చెల్లించకపోతే తీర్పు వెలువడిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తీర్పు కార్యక్రమంలో సభ్యురాలు బాలసుధ పాల్గొన్నారు.