నాగార్జున విశ్వవిద్యాలయం : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ - హైదరాబాద్ (గవర్నమెంట్ బిజినెస్ స్కూల్) అందించే ప్రతిష్టాత్మక పరిశోధక ఫేలోషిప్ కు నాగార్జునా విశ్వవిద్యాలయం, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం పరిశోధక విధ్యార్ధి బయ్యా రాజేష్ కుమార్ ఎంపిక అయ్యారు. అచార్య రామినేని శివ రామ ప్రసాద్ మార్గదర్శకత్వంలో "భారతదేశంలో వ్యాపార ఇంక్యుబేషన్ సెంటర్ల పనితీరు, స్టార్టప్‌లపై దాని ప్రభావం, ఒక అధ్యయనం" అనే అంశంపై రాజేష్ పరిశోధన చేస్తున్నారు. ఈ ఫెలోషిప్ 3 దశల్లో జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు.  అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్ , పరీక్ష ,ఇంటర్వ్యూ ద్వారా తుది జాబితాను సిద్దం చేయగా, వివిధ రాష్ట్రాల నుండి 150 మంది పోటీ పడ్దారు. 50 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకోగా, నలుగురు అభ్యర్థులను మాత్రమే ఫెలోషిప్ కు ఎంపిక చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజేష్ ఒక్కరే ఎంపిక కాగా,  ఉత్తర ప్రదేశ్,  కాశ్మీర్,  తమిళనాడు నుండి మిగిలిన ముగ్గురు అభ్యర్థులు ఎంపిక అయ్యారు. దీని ద్వారా పరిశోధక విధ్యార్ధి ప్రతి నెల 33వేల రూపాయల వంతున మూడు సంవత్సరాల పాటు పరిశోధక సహాయం పొందగలుగుతారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఉపకులపతి అచార్య రాజశేఖర్ నేతృత్వంలో విశ్వవిద్యాలయం నుండి సమకూరిన విద్యా వనరులు, పరిశోధక సెల్ తోడ్పాటు తనకు ఫెలోషిప్ సాధనలో ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మరోవైపు కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం అధిపతి అచార్య శివరామ ప్రసాద్ జాతీయ స్థాయి సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడం ద్వారా పరిశోధనలకు నిరంతర మద్దతు అందించారన్నారు. రైతు కుటుంబానికి చెందిన రాజేష్,  భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి సాధ్యమైనంత ఉత్తమ విధానాలను అందించడం కోసం ఈ ఫెలోషిప్‌ని సద్వినియోగం చేసుకుంటానన్నారు.