ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
- అధికారుల శిక్షణలో కమిషనర్ మూర్తి
ఈనెల 23వ తేదీన జరిగే స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో ఎన్నికల శిక్షణా తరగతులను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికలతో పాటు పంచాయతీ, ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో బాధ్యత వహించే ఎన్నికల అధికారులకు కూడా శిక్షణ అందించామని తెలిపారు. సూచించిన పోలింగ్ కేంద్రాలకు ఆయా అధికారులు సమయానికి చేరుకుని ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని, ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం కల్పించి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల పర్యవేక్షణాధికారి బసంత్ కుమార్, బుచ్చిరెడ్డి పాలెం కమిషనర్ శ్రీనివాసరావు, అడిషనల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.