పురస్కారాలతో వాలంటీర్లకు మరింత ప్రోత్సాహం  - మేయర్ స్రవంతి జయవర్ధన్

సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పతకాలను అందించడంలో వారధులుగా నిలుస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ అందిస్తున్న పురస్కారాలతో వారికి  మరింత ప్రోత్సాహం అందుతోందని నగర మేయర్ స్రవంతిజయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 2వ డివిజన్ లోని గుడిపల్లిపాడు పరిధిలో విధులు నిర్వహిస్తున వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను స్థానిక సచివాలయంలో  శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని ప్రజలందరితో మమేకమై అనునిత్యం వారి సమస్యలను ప్రభుత్య దృష్టికి తీసుకోచ్చెలా వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. ఉగాది పురస్కారాలకు ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లు అందరికీ మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కాని,  ప్రపంచంలో కాని ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగంగా చేసారని తెలిపారు. మృత్యువుతో ప్రపంచ వ్యాప్తంగా  భీభత్సానికి గురిచేసిన కరోనా సమయంలో సైతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావలసిన సేవలు, అందాల్సిన సంక్షేమ పథకాలను ధైర్యంగా ప్రజలకు వాలంటీర్లు అందజేశారని కొనియాడారు. వాలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది పుర్కారాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని వారు ప్రశంసించారు. అవార్డులు అందుకున్న వాళ్లకి, అందుకోని వాళ్ళకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు రానివాళ్లు మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో పురస్కారపు గౌరవాన్ని అందుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్, 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు, వై.సీ.పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.