జిల్లాలో మూడో విడత కోవిడ్  ముప్పులో ఏ ఒక్కరూ చనిపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డా. పి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. 





    సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబుతో కలిసి " కోవిడ్-19 నియంత్రణపై " జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.  ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టరు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం జిల్లాలో రెండో విడతలో ఆక్సిజన్ కొరత రాకుండా,  కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న వొమి క్రాన్ పెద్దగా ప్రభావం చూపే విధంగా కనబడుట లేదని,  నాలుగు రోజుల్లో నయమవుతుందని, వేగంగా విస్తరిస్తుందని చెబుతూ అది  ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.  జిల్లాలో ప్రతి ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు.  అలాగే ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్న సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ప్రతి ఆస్పత్రిలోనూ ఐసీయు సాంకేతికత ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. పెద్దలతో సహా పిల్లలకు కూడా మంచి వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రుల్లో మంచి నాణ్యమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండవ విడత కోవిడ్ ముప్పు సమయంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ రోగులను బాగా  చూసుకోవడం శుభపరిణామమన్నారు. అక్కడ అధికారులు, వైద్య సిబ్బంది అద్భుతంగా సమన్వయంతో పని చేశారని కితాబిచ్చారు. కోవిడ్ ముప్పు ఎటువంటి విభిన్న తరహాలో వచ్చినప్పటికీ మంచి వైద్య పరికరాలు, మందులతో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగమంతా సిద్ధంగా ఉండాలన్నారు. చాలా కొలమానాలలో జిల్లా అగ్రగామిగా ఉందన్నారు. కోవిడ్ మొదటి డోసు టీకా వేయడంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి టీకాలు వేయడంలో కూడా జిల్లా దేశంలోనే మొదటి స్థానం సంపాదించిందన్నారు. ఇటీవల తాను కర్నూలు జిల్లాలో జరిగిన సమావేశంలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఇందుకోసం అహర్నిశలు కృషి చేసిన వారందరికీ మరోసారి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  కోవిడ్ నియంత్రణలో జిల్లా యంత్రాంగానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కోవిడ్ కేసులు పరిశీలిస్తే రోజురోజుకు పెరుగుదల కనబడుతోందని అయినప్పటికీ ఆసుపత్రుల్లో చేరే వారు తక్కువగా ఉన్నారని, హోం ఐసోలేషన్ లో ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు. కోవిడ్ నియంత్రణలో రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు అందరం కలిసికట్టుగా పాటించడం వలన ఇటువంటి ఫలితం దక్కిందన్నారు.  కేసులు పెరిగిన తట్టుకునే విధంగా రాబోయే మూడు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 అంతకుమునుపు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర బాబు జిల్లాలో కోవిడ్ నియంత్రణకు చేపట్టిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడో విడత కోవిడ్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో మొత్తం  150716 పాజిటివ్ కేసులు రాగా అందులో 147659 కేసులు ఆరోగ్యవంతులైనారని  97.97 శాతం  రికవరీ రేటు ఉందని వివరించారు.  ప్రస్తుతం రోజువారి పాజిటివ్టి రేటు 20.29 ఉందని 1917 యాక్టివ్ కేసులు ఉన్నాయని మొత్తం 1140 మంది చనిపోయారని చెప్పారు. హోం ఐసోలేషన్ లో  97276 మంది ఉండగా వారికి  మెడికల్ కిట్లు అందజేయడంతో పాటు  క్రమం తప్పకుండా వారి ఆరోగ్య పరిస్థితులను ఏఎన్ఎంలు,  ఆశ కార్యకర్తలు, వాలంటీర్లు, మెడికల్ అధికారులు పర్యవేక్షించడంతో  95828 మంది ఆరోగ్యవంతులు అయ్యారని వారికి  కాల్ సెంటర్ నుండి టెలి కన్సల్టేషన్ ద్వారా సంప్రదించడం జరుగుతోందన్నారు.  కోవిడ్ పాజిటివ్ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లో కూడా మ్యాపింగ్ చేసి హోమ్ క్వారంటైన్లో ఉంచి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. జిల్లాలో గతం కంటే కోవిడ్ రోగుల కోసం పడకలు మరింత మెరుగ్గా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 11 కోవిడ్ కేర్ సెంటర్లలో 3730 పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల వారీగా 639 గ్రామ సచివాలయాల్లో మైనర్ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు గుర్తించామన్నారు. జిల్లాలో అవసరమైనంత మేరకు మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. టీకాలు వేయడంలో జిల్లా అత్యున్నతంగా పనితీరును కనిపించిందని ప్రజల్లో కూడా మంచి చైతన్యం ఉందన్నారు.  రెండవ డోసు టీకా 18 నుండి 45 సంవత్సరాల వారికి ఇంకా 1.9 లక్షల మందికి  వేయాల్సి ఉంటుందని,  వారందరికీ ఈ నెలాఖరులోగా పూర్తిగా చేయడం జరుగుతుందన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల పదహైదు వయస్సు వారికి మొదటి డోసు పూర్తిచేశామని,దేశంలోనే నాలుగు రోజుల్లో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచామన్నారు.  జిల్లాలో కావలసినంత కోవిడ్ డోసులు సిద్ధంగా  అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో రాత్రి కర్ఫ్యూ మంగళవారం నుండి  అమలులోకి వస్తుందన్నారు.  బహిరంగ ప్రదేశాల్లో గాని,  దుకాణాల్లో గాని ఎవరైనా సరే మాస్కులు లేకుండా ఉంటే జరిమానా విధించాలని హెచ్చరికలు జారీ చేశామన్నారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేక వార్డులు,ఐ సి యూ వార్డులు  కూడా సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రులను  నిరంతరం పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఆరు చోట్ల  పి ఎస్ ఏ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పామని మరో మూడు చోట్ల ఈ వారంలో ఏర్పాటు చేస్తామన్నారు.  జిల్లాలో మూడో విడత కోవిడ్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేట్ టర్లు కావలసినన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే కోవిడ్ నియంత్రణ కోసం అవసరమైన వైద్య నిపుణులు,  వైద్య సిబ్బందిని నియమించామన్నారు. జిల్లాలో 1173 మందికి కోవిడ్ మరణాలకు సంబంధించి  ఎక్స్ గ్రేషియా మొత్తాలు  అందించామన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి సంబంధించి వారి వారసులకు ఉద్యోగ నియామకాలు చేశామన్నారు. లో 19 మంది అనాధ పిల్లలకు సంబంధించి ఎక్స్గ్రేషియా ఫిక్సిడ్ డిపాజిట్ చేశామన్నారు.

 ఈ సమావేశంలో రెవిన్యూ సంయుక్త కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, అదనపు ఎస్పి శ్రీమతి వెంకటరత్నం, డి ఎఫ్ శ్రీ షణ్ముఖ కుమార్, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆసరా సంయుక్త కలెక్టర్ శ్రీమతి రోస్ మాండ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చిన్న ఓబులేసు, జడ్పీ సీఈవో శ్రీ శ్రీనివాస రావు, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, కోవిడ్ నోడల్ అధికారులు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు