జిల్లాల విభజనపై మొదలైన రగడ రాపూరులో ఎమ్మెల్యే ఆనం నిరాహార దీక్ష
జిల్లాల విభజనపై మొదలైన రగడ రాపూరులో ఎమ్మెల్యే ఆనం నిరాహార దీక్ష
రాపూరు: జిల్లాల పునర్విభజన రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రాపూరు , కలువాయి , సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ దీక్షలు మొదలయ్యాయి.అందులో భాగంగా రాపూరు , కలువాయి , సైదాపురం మండలాలలో నిరాహార దీక్షలు చేపట్టారు.వారికి మద్దతుగా ఎమ్మెల్యే ఆనం నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన వల్ల జరిగే నష్టాన్ని తెలపడం కోసమే దీక్షలు చేస్తున్నని అన్నారు.13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తే పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని సీఎం నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నామని అన్నారు.కానీ వెంకటగిరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపటం కొంత నష్టం ఉందని అన్నారు. రాపూరు మండలానికి తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. రాపూరుకి జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో ప్రత్యేక స్థానం ఉందని నియోజక వర్గాల పునర్విభజనలో స్వార్థరాజకీయం కోసం కాంగ్రెస్ లోని పెద్దమనిషి రాపూరుకి ద్రోహం చేశారని విమర్శించారు. మరోసారి మోసపోయేందుకు రాపూరు , కలువాయి వాసులు సిద్ధంగా లేరన్నారు.ఆరు దశాబ్దాల పాటు మా కుటుంబాన్ని ఆదరించిన రాపూరుకి ద్రోహం జరగనివ్వమని ఘాటుగా స్పందించారు.కొంతమంది స్వార్ధం వలన దీక్షలు చేయాలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర విభజన తెలుగు రాష్ట్రాలకు గొడ్డలి పెట్టు అయిందని ఢిల్లీ పెద్దల అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయామని విమర్శించారు. సోమశిల ,కండలేరు జలాల కేటాయింపులే ఇంతవరకు జరగలేదన్నారు. ఇప్పుడు ఆ సమస్య జఠిలమయ్యే ప్రమాదం ఉందన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా అధికారులు విభజన చేయలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఖచ్చితంగా మన అభ్యర్థనను పరిశీలిస్తారని ధీమా వ్యక్తం చేశారు.తిరుపతి పార్లమెంటులోని సర్వేపల్లిని నెల్లూరులో ఎలా కలిపారని ప్రశ్నించారు.వారికొక న్యాయం ఇక్కడి వారికి ఒక న్యాయమా అని అన్నారు. దానిపై అధికారులు సమాధానం చెప్పాలని తెలిపారు. ఆ తరహాలో రాపూరు , సైదాపురం కలువాయిలని నెల్లూరు జిల్లాలో ఎందుకు కలపరో అధికారులు చెప్పాలని కోరారు.అధికారులు చేసిన తప్పిదాలను ప్రశ్నించాలసిన సమయం వచ్చిందని అన్నారు. నాగార్జున సాగర్ లాంటి దుస్థితి సోమశిల ప్రాజెక్టుకు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఇవేమి పట్టని అధికారులు ఎవరినీ సంప్రదించకుండా విభజన ఎలా చేస్తారన్నారు.సోమశిల నుంచి నియోజకవర్గాలకు నీటి కేటాయింపులు ఎలా చేయాలో ఆలోచించారా రెండు జిల్లాల మధ్య నీటి యుద్దాలు జరిగే పరిస్థితి గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు.విభజన వల్ల కొత్త కొత్త వివాదాలు తలెత్తుతాయని తెలిపారు.అభ్యంతరాలు ఉంటే తెలపాలని సీఎం స్వయంగా ప్రకటించారని సహేతుకమైతే పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సీఎం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అధికారులు అడ్డగోలు విభజన చేశారని దుయ్యబట్టారు.ప్రజల మనో భావాలను గౌరవించకుండా గాయపరిచారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ప్రజాభీష్టం తెలుకొని మసులుకోకుంటే మనుగడ ప్రస్నార్ధకం అవుతుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని హామి ఇచ్చారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పునర్విభజనపై పునరాలోచించాలని,11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి కండలేరు జలాలను సాధించానని అవసరమైతే అలాంటి పోరాటం చేసేందుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు.