తిరుపతి పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాము : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్





తిరుపతి నగరం


తిరుపతి నగరంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతమివ్వాలని, పరిసరాలు, కాలువలు, రహదారులు శుభ్రంగా వుంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనమందరం కృషి చేద్దామని మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య, ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేసారు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్. తిరుపతి నగరంలోని భవానీ నగర్, రైల్వే కాలనీ, సుందరయ్య నగర్, సప్తగిరి నగర్, యశోధ నగర్, మధురా నగర్, ఖాధీ కాలనీ, కేటి రోడ్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం కమిషనర్ పర్యటించారు. సామవాయి మార్గంలో స్వీపింగ్ మిషన్ల పనితీరును పరిశీలించి తగు సూచనలు జారీ చేస్తూ స్వీపింగ్ పనులను పూర్తి స్థాయిలో అనుకున్న మేరకు పూర్తి చేసేలా సిబ్బంది పనితీరు వుండాలన్నారు. బ్లిస్ ప్రక్కన మురుగునీరు లీక్ అవుతున్న విషయాన్ని పరిశీలించి, మరమ్మత్తులు వెంటనే చేయాలని, రేణిగుంట రోడ్డు ప్రాంతాల్లో రహదారిపై డ్రైనేజి పైప్ దెబ్బతినడంతో ఆ పరిసరాలు మురుగునీటితో కనిపించడంతో తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. ఉప్పంగి హరిజన వాడ, భవాని నగర్ ప్రాంతాల్లో డ్రైనేజి మూతలను తీయించి మురుగు నీరు సక్రమంగా పారుతున్నదా అని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ అదితిసింగ్ అధికారులకు సూచనలు ఇస్తూ తిరుపతిని అన్ని విధాలా తీర్చిదిద్దాలని, ముఖ్యంగా పారిశుధ్యాని ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రైనేజి మరమ్మత్తులను, కాలువల్లో సీల్ట్ తీయించే ప్రక్రియ నిరంతరం చేపట్టాలని, త్రాగునీటి పైప్ లైన్లలో మురుగు నీరు కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డయేరియా, మలేరియా, డెంగీ ప్రభలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, బ్లీచింగ్ చల్లించడం, క్లోరినేషన్ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకొని పనులు చేపట్టడం చేయాలని, అదేవిధంగా మురికి నీరు సాఫిగా వెల్లేందుకు నిరంతరం పర్యవేక్షిస్తూ కాలువలపై ఆక్రమణలు తొలగించాలని, తిరుపతి పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ ప్రజలనుద్దేశించి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ శ్రావణి, శానిటరి సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి పాల్గొన్నారు.