అందరి సహకారంతో "నక్ష " కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి







నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):

అధునాతన డ్రోన్ సాంకేతిక విధానం ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేద్దామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు.భారత ప్రభుత్వం నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ - బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్ (NAKSHA) కార్యక్రమం అధికారిక ప్రారంభోత్సవాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. కమిషనర్ సూర్య తేజ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం డ్రోన్ సర్వే పనితీరును సాంకేతిక విభాగం బృందాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా "నక్ష" కార్యక్రమం అమలుతీరు, దాని ప్రయోజనాలను నిర్వాహకులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 152 పట్టణ స్థానిక సంస్థలలో (ULB) ఏకకాలంలో "నక్ష" నగర సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఈరోజు నిర్వహించనున్నారని తెలిపారు. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు ప్రోగ్రాంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నగర సర్వేను నెల రోజుల పాటు నిర్వహించనున్నారని వివరించారు.అనంతరం

కమిషనర్ సూర్య తేజ మాట్లాడుతూ నక్ష సర్వే ద్వారా పట్టణ భూమి రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసి GIS-మ్యాప్ చేస్తారని, నిర్మాణాత్మక, పారదర్శక డేటాను నిర్ధారిస్తారని తెలిపారు. విపత్తు నిర్వహణతో పాటు, పర్యావరణ ప్రణాళిక, స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం సర్వే ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.స్పష్టమైన, నవీనీకరించబడిన యాజమాన్య రికార్డుల ద్వారా భూ వివాదాలను తగ్గించడం, చట్టపరమైన ప్రక్రియలను వేగవంతం చేయడం, ఆస్తి హక్కులను మెరుగుపరచడం వంటి ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు.కోర్టు కేసులు, చట్టపరమైన డాక్యుమెంటేషన్, చారిత్రక భూమి డేటా విశ్లేషణలో సర్వే వివరాలు సహాయపడతాయని, వేగవంతమైన, సమర్థవంతమైన పట్టణ ప్రణాళిక సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఖచ్చితమైన భూమి డేటాను అందించడంతోపాటు, మెరుగైన జోనింగ్ నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర విస్తరణను కనీస జాప్యాలతో అనుమతిస్తుందని తెలిపారు."నక్ష" సర్వే నిర్వహణ ద్వారా రవాణా ప్రణాళిక, గృహనిర్మాణ ప్రాజెక్టులు, స్థిరమైన పట్టణాభివృద్ధిలో సహాయపడుతుందని,

సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఉపయుక్తంగా ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. పట్టణ స్థానిక సంస్థల (ULB) పన్ను ఆదాయ సేకరణను మెరుగుపరుస్తుందని,పన్ను ఎగవేతను తగ్గిస్తుందని వివరించారు.అదనపు కమిషనర్ వై.ఓ. నందన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్, కో ఆప్షన్ నెంబర్లు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సిటీ ప్లానర్ హిమబిందు, డి.సి.పి పద్మజ, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డ్ ప్లానింగ్ & రెగ్యులైజేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.