భూ సేకరణ చేసే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. భూ యజమానిని సంతోష పెట్టి భూమి  తీసుకోవాలే గానీ వారిని బాధ పెట్టి భూమిని తీసుకోవద్దనీ..అవసరమైతే భూమి గలవారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నామని, దాని కోసం ఎవరి ఉసురూ మనకు తగలకూడదని..దాని కోసం భూ సేకరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. మంగళవారం (ఫిబ్రవరి 25,2020)‘స్పందన’పై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల ప్రగతిని సమీక్షిస్తూ.. ఏ జిల్లా కలెక్టరు కూడా తమ వద్ద నుంచి భూముల్ని అన్యాయంగా లాక్కున్నారనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి వివిధ జిల్లాలకు సీఎస్‌ సహా సీఎం కార్యాలయ ఉన్నతాధికారులను నియమించామని ఆదేశించారు.  దీంట్లో భాగంగా..మార్చి 1 నాటికి ఇళ్ల స్థలాల కోసం తీసుకున్న భూములను పొజిషన్‌లోకి తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వీలైనంత త్వరగా భూమిని సమీకరించాలనీ..ప్లాట్లు మార్కింగ్‌ చేసి ఉంటే, వెంటనే లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ఉగాది కానుకగా పేదలకు మార్చి 25న పట్టాల పంపిణీ చేస్తామని జగన్ తెలిపారు.సమయం అతి తక్కువగా ఉందని యుద్ధ ప్రాతిపదికన పనులు చేయకపోతే అనుకున్న సమయానికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేమని కాబట్టి త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూములను వెంటనే అభివృద్ధి చేసి ప్లాట్లు డెవలప్‌ చేయాలని చెప్పారు.