లక్షలు ఖర్చుపెట్టి కట్టారు.. లక్షణంగా వదిలేశారు





- నిరుపయోగంగా దోబి ఘాట్ 


- పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు


- మందుబాబులకు నిలయంగా దోబి ఘాట్ 



కొండాపురం, మేజర్ న్యూస్, సూర్య:: ఒకటికి రెండుసార్లు దోబీ ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మొదటిసారి ధోబి ఘాట్ నిర్మాణానికి లక్ష రూపాయలు మంజూరు చేశారు. ఆ నిధులు సరిపోకపోవడంతో రెండోసారి బీసీ కార్పొరేషన్ ద్వారా ఏకంగా రూ. ఐదు లక్షలు నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో కొండాపురంలో దోబీ ఘాట్ నిర్మాణం పూర్తయింది. అయితే నిర్మించిన ఈ దోబి ఘాట్ గత ఎనిమిది ఏళ్లకు పైగా నిరుపయోగంగా ఉంది. కొండాపురం గ్రామంలో 60 కుటుంబాల వారు రజక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. రజకులు ఒక్కరు కూడా బట్టలు శుభ్రపరిచేందుకు ఈ దోబి ఘాట్ ను ఉపయోగించుకున్న సందర్భం లేదు. అధికారులు మాత్రం నిర్మాణం పూర్తయిన తర్వాత రజకులు దీని ఉపయోగిస్తున్నారా లేదా అని పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో దోబి ఘాట్ చుట్టూ కర్ర తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పరిసర ప్రాంతాలు ముందు బాబులకు అడ్డాగా మారిపోయాయి. బట్టలు శుభ్రపరిచేందుకు నిర్మించిన తొట్లన్నీ మందు సీసాలతో నిండిపోయాయి. కొంతమంది విమర్శకులు మాట్లాడుతూ ఇందు కొరకు ఖర్చు చేసిన రూ. ఆరు లక్షలు రక్షిత మంచినీటి సరఫరా కు ఖర్చు చేసి ఉంటే బాగుండేదనిబాగుండేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోబి ఘాట్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.