ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతం

36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్.

ఎల్వీఎం-3-ఎం-3 రాకేట్ ఎత్తు 43.5 మీటర్లు.

బరువు 643 టన్నులు. 36 ఉపగ్రహాల బరువు 5,805 కిలోలు.

రవి కిరణాలు శ్రీహరికోట సూళ్లూరుపేట మార్చి 26:-

భారత అంతరిక్షపరిశోధన కేంద్రం శ్రీహరికోట షార్ నుండి ఆదివారం ఉదయం ప్రయోగించిన ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిర్దిష్ట కక్ష్యలోకి 36 ఉపగ్రహాలు చేరుకున్నాయి. యూకే తో భారత్ కుదుర్చుకున్న ఒప్పంద ప్రయోగాలలో రెండో ప్రయోగం ఘనవిజయం సాధించింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో వాణిజ్య ప్రయోగాలకు డిమాండ్ పెరుగనుంది.

ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగం ఊహించిన విజయం సాధించి పెట్టిందన్నారు. కక్ష్యలోకి చేరుకున్న 16 ఉపగ్రహాల నుంచి భూమికి సంకేతాలు అందాయన్నారు. ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగ విజయం ఇస్రోకు గర్వకారణమని, ఈ విజయం చారిత్రాత్మక విజయంగా భావించాలని అన్నారు. ఎల్వీఎం-3-ఎం-3 ప్రయోగ విజయం భవిష్యత్తు ప్రయోగాలకు ప్రాణం పోసిందని, షార్ నుంచి పీఎస్ఎల్వీ ద్వారా మరో వాణిజ్య ప్రయోగం త్వరలోనే ఉంటుందని సోమనాథ్ స్పష్టం చేశారు.

కాగా షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి నిర్విఘ్నంగా కౌంట్ డౌన్ సాగింది. భూమి ఉపరితలం నుంచి 450 కి.మీ దూరంలోని లియో ఆర్బిటల్ వృత్తాకార కక్ష్యలోకి 36 ఉపగ్రహాలను ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు. 20 నిమిషాలపాటు నింగిలో ప్రయాణించిన అనంతరం 36 ఉపగ్రహాలను ఒకదాని వెంట ఒకటి కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది. ఎల్వీఎం-3-ఎం-3 రాకేట్ ఎత్తు 43.5 మీటర్లు. బరువు 643 టన్నులు. 36 ఉపగ్రహాల బరువు 5,805 కిలోలు. రాకెట్ ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ రాకెట్ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.