జమ్ము- కశ్మీరు: మోదీ సభా ప్రాంగణానికి12కీ.మీ. దూరంలో భారీ పేలుడు..
జమ్ము- కశ్మీరు: మోదీ సభా ప్రాంగణానికి12కీ.మీ. దూరంలో భారీ పేలుడు..
శ్రీనగర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూ-కశ్మీరు పర్యటన ఆదివారం ప్రారంభమైంది. అయితే జమ్మూ జిల్లాలో ఆయన పాల్గొనబోతున్న బహిరంగ సభా ప్రాంగణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లలియానా గ్రామంలోని ఓ పొలంలో భారీ పేలుడు సంభవించింది.హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పేలుడు స్వభావంపై దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఉగ్రవాద సంబంధిత పేలుడుగా కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇది ఉల్క అయి ఉండవచ్చునని తెలిపారు. ఇదిలావుండగా, మోదీ పర్యటన సందర్భంగా జమ్మూ-కశ్మీరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాల సందర్భంగా మోదీ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం జమ్మూ డివిజన్‌లోని సాంబ జిల్లా, పల్లి పంచాయతీ నుంచి జరుగుతుంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధి కోసం దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. బనిహాల్-కాజీగుండ్ రోడ్డు సొరంగం, ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్‌వే, రట్లే, క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.