మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను  సాకారం  చేసే లక్ష్యంతో  జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్  పధకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


మంగళవారం ఉదయం  ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి  వర్చువల్ విధానం ద్వారా  జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్  పధకానికి సంబంధించిన  వెబ్ సైట్ ను  రాష్ట్ర ముఖ్యమంత్రి   శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,  పేద వాని సొంతింటి కల నెరవేర్చే ఉద్ధేశ్యంతో నవరత్నాల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, తొలి విడతగా 15 లక్షల మందికి  ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.  మధ్య తరగతి ప్రజలకు కూడా సొంతింటి కల సాకారం చేసేందుకు  ఎటువంటి లాభాపేక్ష లేకుండా, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు క్లియర్ టైటిల్ తో  నాణ్యతా ప్రమాణాలతో,   మౌలిక సదుపాయాలతో  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజక వర్గ పరిధిలో  జగనన్న స్మార్ట్ టౌన్  షిప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందులో భాగంగా  మొదటి దశలో రాష్ట్రంలోని 6  జిల్లాల్లో  అనంతపురం జిల్లా, ధర్మావరం,  గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, వైఎస్ ఆర్ కడప జిల్లా  రాయచోటి, పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా కందుకూరు లో  ఈ పధకాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి  తెలిపారు.  ఏడాది కాలంలో వీటిని అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లే అవుట్ నందు 10 శాతం ఫ్లాట్స్, 20 శాతం రిబేట్ తో కేటాయించడం జరుగుతుందని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి వివరించారు.

కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ రెవెన్యూ శ్రీ హరేందిర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలోని  కావలి నియోజక వర్గ పరిధిలోని జలదంకి మండలం, జమ్మలపాలెం గ్రామంనందు 97.16 ఎకరాల విస్తీర్ణంలో  జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి వివరించారు. ఈ జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్ లో మొత్తం 1112 ఫ్లాట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్, ముఖ్యమంత్రి గారికి తెలిపారు.   జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్  పట్ల మధ్య తరగతి ప్రజల్లో మంచి స్పందన వస్తున్నదని జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, ముఖ్యమంత్రికి వివరించారు. 

ఈ సందర్భంగా నెల్లూరు కు చెందిన శ్రీమతి సాధన మాట్లాడుతూ, మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసేందుకు తక్కువ ధరకే   జగనన్న స్మార్ట్ టౌన్  షిప్  పధకం  ద్వారా  ఫ్లాట్స్ కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.   ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి  మధ్య తరగతి ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని శ్రీమతి సాధన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ,  ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్   పధకం పై   నెల్లూరు పట్టణాభివృద్ది సంస్థ(నూడా) రూపొందించిన   బ్రోచర్ను విడుదల చేశారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ,  మధ్య తరగతి ప్రజల సొంతింటి కళను  సాకారం   చేసేందుకు రూపొందించిన జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్  పధకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.  ఈ పధకం క్రింద జిల్లాలోని  కావలి నియోజక వర్గ పరిధిలోని జలదంకి మండలం, జమ్మలపాలెం గ్రామంనందు 97.16 ఎకరాల విస్తీర్ణంలో  1112 ఫ్లాట్స్ తో జగనన్న స్మార్ట్ టౌన్  షిప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.   ఈ  జగనన్న స్మార్ట్ టౌన్ షిప్  ను అభివృద్ది చేయడానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిందని,  పూర్తి స్థాయిలో పనులు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుందని  జాయింట్ కలెక్టర్ తెలిపారు.   ప్రజలు ఆన్ లైన్ ద్వారా ధరకాస్తు చేసుకోవాలని,  ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ఫ్లాట్స్, 20 శాతం రిబేట్ తో కేటాయించడం జరుగుతుందని, మధ్య తరగతి ప్రజలు,   ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  జాయింట్ కలెక్టర్  తెలిపారు. 

నూడా ఛైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు 6 జిల్లాల్లో జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్  పధకాన్ని ప్రారంభించడం, అందులో  నెల్లూరు జిల్లా ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కావలి నియోజక వర్గ పరిధిలోని జమ్మలపాలెం గ్రామంనందు 97.16 ఎకరాల విస్తీర్ణంలో     నిర్మిస్తున్న  జగనన్న స్మార్ట్ టౌన్  షిప్స్  జిల్లాకు తలమానికంగా ఉండేలా  అభివృద్ది చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమానికి   నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాధ్,  నెల్లూరు నగర కమీషనర్ శ్రీ దినేష్ కుమార్,   డి.సి.ఎం.ఎస్ చైర్మన్ శ్రీ వీరి చలపతి, ఆఫ్కాఫ్ ఛైర్మన్ శ్రీ   కొండూరు అనిల్ బాబు,  విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి  రంగారెడ్డి, నుడా వైస్ ఛైర్మన్ శ్రీ రమేష్ బాబు,  ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.