ఆక్రమణల్లో జగనన్న ఇంటి స్థలాలు 

 దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు 

 చోద్యం చూస్తున్న అధికారులు 

 స్పందనలో జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చిన బాదితులు 

 మా స్థలాన్ని మాకు ఇప్పించండి సారు ... అంటూ వేడుకోలు 

 రవి కిరణాలు తిరుపతి జిల్లా నాయుడుపేట:-

ఆర్థిక బలం,రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు స్వార్ధపరులకు అధికారులు సైతం వత్తాసు పలుకుతుండడంతో అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మూడు లక్షల జగనన్న ఇంటి స్థలాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2000 మందికి బిరదవాడ వద్ద గల టిట్కో అపార్ట్మెంట్స్ వద్ద, శ్రీనివాసపురం వద్ద ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అర్హత ఉండి ఇంటిస్థలం వచ్చినప్పటికీ ఆర్థిక స్తోమత లేక వందలాది మంది నిరుపేదలు ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు.ఇదే అదునుగా భావించిన కొందరు స్వార్ధపరులు రాజకీయ నాయకులు,అధికారుల అండతో  ఖాళీగా ఉన్న స్థలాలను ఆక్రమించి భవంతులను నిర్మిస్తున్నారు.దీనితో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టకోలేని నిరుపేదలు మండల స్థాయి అధికారులకు చెప్పుకున్నా న్యాయం జరగడం లేదు. దీనితో సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆక్రమణలో ఉన్న తమ ఇంటి స్థలాన్ని ఇడిపించి తమకు అప్పగించి న్యాయం చేయాలని  నాయుడుపేట పట్టణం లోని లోతివానిగుంట ప్రాంతానికి చెందిన అమాస రాజేశ్వరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి వేడుకుంది. ఈమెకు 2020 సంవత్సరంలో నాయుడుపేట పట్టణ సమీపంలోని బిరదవాడ వద్దగల టిట్కో అపార్ట్మెంట్ వద్ద  జగనన్న కాలనీలో (ప్లాట్ నెంబర్ 164 ) ఇంటి స్థలానికి పట్టా ఇచ్చి ఉన్నారు. నిరుపేదలైన వారు ఇల్లు కట్టుకోలేని స్తోమత లేకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ స్థలంపై కన్నేసిన నాయుడుపేట పట్టణంలోని బేరిపేటకు చెందిన వరప్రసాద్,హేమలతలు ఆ స్థలంలో ఇల్లు కడుతూ గోడలు నిర్మించి ఉన్నారు. విషయం తెలుసుకున్న రాజేశ్వరి తమ స్థలంలో ఇల్లు కట్టడాన్ని అడ్డుకోవడంతో అధికారుల అండ, రాజకీయ బలం ఉన్న వారు ఆమెపై దౌర్జన్యం చేసే తరిమి వేశారు. దీనితో రాజేశ్వరి నాయుడుపేట మున్సిపల్ కమిషనర్, మండల తహసిల్దార్ లకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తనకు న్యాయం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది.ఈ నేపథ్యంలో ఆమె సోమవారం తిరుపతి కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. నిరుపేదలమైన తమకు న్యాయం చేసి ఇంటి స్థలం ఇప్పించాలని కోరింది. ఇకనైనా సంబంధిత అధికారులు నిరుపేదలైన రాజేశ్వరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.