వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32నెలలు పూర్తైందని, ఈ 32నెలల్లో ప్రతి ఒక్కరూ జరిగిన నష్టాన్ని విశ్లేషించుకోవాలని సూచించారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. జరిగిన పరిణామాలను అవగతం చేసుకుని జరగబోయే నష్టాన్ని గమనించాలని అన్నారు చంద్రబాబు.

 ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రజావేదికలో పెట్టి అక్కడే కూల్చివేత ప్రకటన చేసి, ఇంతవరకు శిథిలాలను కూడా తొలగించలేదని జగన్ రెడ్డి ఓ విధ్వంసకుడు అని విమర్శించారు చంద్రబాబు.

 ప్రజల ఆస్తి విధ్వంసం చేయడంతోనే మనిషిలో ఉన్మాదం బయటపడిందని, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం అమరావతి వరకూ కొనసాగిందని, భూములిచ్చిన పాపానికి రైతులంతా ఎన్నో అవమానాలు భరిస్తున్నారని అన్నారు చంద్రబాబు.

 ఆనాడు సైబరాబాద్‌ని గ్రాఫిక్స్ అని ఉంటే ఈనాడు అభివృద్ధి కనిపించేదా? అని ప్రశ్నించారు చంద్రబాబు, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేయిస్తారని, రెండు లక్షల కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. 

 అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, పోలవరం డీపీఆర్‌ని ఎందుకు ఖరారు చేయలేకపోయారని నిలదీశారు. 2021డిసెంబర్‌కు పూర్తిచేస్తామన్న పోలవరం ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. పోలవరం పూర్తిచేయటం మీకు సాధ్యమవుతుందా? దీనిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు చంద్రబాబు.