అత్యున్నత పదవిలో ఉంటూ పచ్చి అవాస్తవాలు మాట్లాడటం సీఎస్ కు తగదు
అత్యున్నత పదవిలో ఉంటూ పచ్చి అవాస్తవాలు మాట్లాడటం సీఎస్ కు తగదు
తప్పుడు లెక్కలు చెబుతూ ఉద్యోగుల నెత్తిన టోపీపెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం ఉద్యమబాట పట్టిన ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయబద్దమైనవే ఉద్యోగుల ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అమరావతిలో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యున్నతమైన స్థానంలో ఉన్న సీఎస్ రాష్ట్ర ఆదాయంపై అబద్దాలు ఆడుతున్నారు. పరిపాలన విభాగానికి ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఉండి అవాస్తవాలు మాట్లాడటం ఎంత వరకు సమంజసం. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వారి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. 2021 నవంబర్ నాటికి రాష్ట్ర ఆదాయం రూ.88,618 కోట్లు అని కాగ్ చాలా స్పష్టంగా చెబుతుంటే సి.ఎస్ మాత్రం కేవలం రూ.62 వేల కోట్లే అని అబద్దమాడుతున్నారు. సి.ఎస్ ప్రభుత్వం ఆడమన్నట్లు ఆడుతూ బీద అరుపులు అరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నాటికి చేసిన అప్పు అక్షరాల రూ. 49,570 కోట్లు. వచ్చిన ఆదాయం, తెచ్చిన అప్పులు కలుపుకుంటే రాష్ట్ర ఆదాయం రూ. 1,38,118 కోట్లు.ఇంత చేసినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యం. వ్యవసాయం అభివృద్ధి గానీ, రోడ్లు మరమత్తులు గానీ, ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు గానీ కట్టిన దాఖలా లేదు. రాబోయే నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వానికి మరో రూ 44 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.ఈ నాలుగు నెలల్లో ఎంత అప్పు చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. 2014-15 లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం రాష్ట్ర ఆదాయం రూ. 65,695 కోట్లు మాత్రమే. అయినా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం.
ఫిట్ మెంట్ ఇవ్వడం ఆలస్యమైందని 2014 ఏప్రిల్ నుంచి అమలు చేశాం.
తెలంగాణ ఆదాయం 2021 నవంబర్ నాటికి 74,940 కోట్లు. అంటే ఏపీకి తెలంగాణ కంటే రూ. 13,678 కోట్లు అదనపు ఆదాయం ఉంది. తెలంగాణ నవంబర్ నాటికి చేసిన అప్పు రూ. 30,194 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 49,570 కోట్లు ఈ ప్రభుత్వంలో నిత్యవసర వస్తువుల ధరలు 35 శాతం పెరిగిపోయాయి. పెట్రోల్,డీజిల్ ధరలు 40 శాతం పెరిగాయి. కర్ణాటక కంటే ఒక్క డీజిల్ పైనే ఏపీ రూ.10 లు అధికంగా వసూలు చేస్తున్నారు. 2018-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 7 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని నేడు రూ.24 వేల కోట్లకు పెంచారు. రాబోయే రోజుల్లో మద్యంపై రూ.30 వేల కోట్లకు టార్గెట్ పెట్టారు. ఇదేనా మద్యనిషేదం. జగన్ రెడ్డి పాలనలో ఒక పేదవాడు తన స్కూటర్ లో లీటర్ పెట్రోలు పోసుకోలేని పరిస్థితి. కరెంట్ ఛార్జీలు, ఆస్థిపన్ను, చెత్తపన్ను పెంచి తెలంగాణ కంటే ఎక్కువ ఆదాయం రాబట్టి బీద అరుపులు అరిస్తే ఎవరూ నమ్మరు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయం కుదేలైపోయింది. 2019-20 లో వ్యవసాయరంగానికి బడ్జట్ లో రూ. 18,130 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం రూ. 6,929 మాత్రమే. నీటిపారుదల రంగానికి బడ్జట్ కేటాయింపు 11,193 కోట్లు ఖర్చు చేసింది రూ. 3,659 కోట్లు, రోడ్లు భవనాలకు బడ్జట్ లో కేటాయించింది రూ 3,886 కోట్లు ఖర్చు చేసింది రూ. 1274 కోట్లు. అభివృద్దిని అటకెక్కించి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి ప్రజలపై పన్నులు వేసి వసూలు చేసుకుంటున్న సంగతి సి.ఎస్ కు తెలియదా? సుప్రీంకోర్టుకు హాజరవడం చాలా బాధవేసిందని సి.ఎస్ మాట్లాడుతున్నారు. వేలాదిమంది ప్రజలు, నాయకులు అక్రమ కేసులతో రోజు కోర్టులు చుట్టూ తిరుగున్నప్పుడు రాని భాద ఇప్పుడెందుకు? ప్రజలు కోర్టుల చుట్టూ తిరగుతుంటే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినలేదా? అన్యాయం జరుగుతుంటే ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఆపాల్సిన భాద్యత సి.ఎస్ కు లేదా? ఈ రాష్ట్రంలో బాధితులపైనే కేసులు పెడుతున్న సంగతి సి.ఎస్ కు తెలియదా? ప్రభుత్వం ప్రజల మాన, ప్రాణాలు, ఆస్తులపై పడి దాడి చేస్తుంటే సి.ఎస్ ఏనాడైనా సమీక్షించారా? సీ.ఎస్, ఫైనాన్స్ సెక్రటరీ లు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలకు అబద్దాలు మాట్లాడటం సమంజసం కాదు. హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీ ఉండే రాష్ట్రం కంటే ఎక్కువ ఆదాయం ప్రజలపై పన్నులు వేసి రాబట్టి తెలంగాణ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరి ఏపీ ఎందుకు చేయలేకుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయం పెంచితే ప్రతీ ఒక్కరు సంతోషిస్తారు. ప్రజలపై పన్నుల భారం వేసి ఆదాయం పెంచితే దాన్ని అభివృద్ధి అనరు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమివేశారు. ఇదేనా అభివృద్ది? కేంద్రం పెట్రోలు, డీజీల్ పన్ను తగ్గిస్తే రాష్ట్రానికి తగ్గించే బాధ్యత లేదా? ఇప్పటికైనా ప్రభుత్వం పంతాలకు పోకుండా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రిని ఒప్పించాల్సిన బాధ్యత సి.ఎస్ పైనే ఉంది. 16 వేల కోట్లు రెవెన్యూ లోటులోను 43 శాతం ఫిట్ మిట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే ఇప్పుడు యావత్తు తప్పుడు లెక్కులు చెబుతూ ఉద్యోగస్తులకు టోపీ పెట్టాలని చూస్తున్నారు. కరోనా థర్డ్ ఫేజ్ విజృంబిస్తున్న సమయంలో ఉద్యోగస్తులు రోడ్లపై ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు.