శ్రీసిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
శ్రీసిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
శ్రీసిటీలో గురువారం 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో వేడుకగా, ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు విజిటర్స్ సెంటర్ ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమంలో సుమారు 130 మంది పాల్గొన్నారు. శ్రీసిటీ డీఎస్పీ జగదీష్ నాయక్ ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడుకోవడానికి యోగా చాలా అవసరమన్నారు. స్వంత ఆనందంతో పాటు సమాజ ప్రయోజనం కోసం అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని కోరారు.
నెల్లూరులోని ప్రణవ వెల్నెస్ సెంటర్ కు చెందిన యోగా గురువు వి.చంద్రశేఖర్, ఆయన శిష్యుడు భార్గవ కృష్ణ ప్రత్యేక అతిధులుగా పాల్గొని, కార్యక్రమంలో పాల్గొన్న వారికి సూర్య నమస్కారాలు, వివిధ శ్వాస వ్యాయామాల పట్ల శిక్షణ ఇవ్వడంతో పాటు యోగా వలన కలిగే పలు ప్రయోజనాలను వివరించారు.
యోగా దినాన్ని పురస్కరించుకుని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో, యోగా ప్రాచీన భారతావని మానవాళికి అందించిన అమూల్య బహుమతి అని పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందవచ్చన్నారు. దైనందిక జీవితంలో యోగాను ఒక భాగం చేసుకొని, తద్వారా మంచి ఆరోగ్యం, చక్కని మానవ సంబంధాలు, మంచి ఆలోచనలను పొందాలని ఆయన శ్రీసిటీ ప్రాంతవాసులకు సూచించారు.
శ్రీసిటీ జనరల్ మేనేజర్ సన్యాసిరావు ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్, శ్రీసిటీ సెజ్ కార్యాలయ స్పెసిఫైడ్ ఆఫీసర్ మధుబాబు, ఆథరైజ్డ్ ఆఫీసర్ రామారావు, రోటోలాక్ పరిశ్రమ ఎండీ ప్రసన్న, పలు పరిశ్రమల ఉద్యోగులు, విద్యార్థులు, పరిసర గ్రామస్థులు పాల్గొన్నారు.