రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* హాల్ టిక్కెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా అనుమతి
* ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ వెల్లడి
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 10,65,156 మంది పరీక్షలు రాస్తుండగా, వీరిలో మొదటి సంవత్సరానికి 5,46,368 మంది, ద్వితీయ సంవత్సరానికి 5,18,788 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలన్నింటిల్లోనూ సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు bఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని, వాటిపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షలు రాయొచ్చునని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించి సమస్యలు ఉంటే 0866-2974130, టోల్ ఫ్రీ నెంబర్ 18002749868 ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయని, వాట్సాప్ చేసేందుకు 9391282578 నెంబర్ ఏర్పాటు చేశామన్నారు.