రోజంతా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపిన మంత్రి మేకపాటి

 పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. హైదరబాద్ గచ్చిబౌలిలోని  తన సొంత కంపెనీ కే.ఎమ్.సీలో ఉన్న అమ్మవారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోమాత ఆశీర్వాదం తీసుకున్నారు.  అరటిపండ్లను ఆహారంగా అందిస్తూ కాసేపు ఆహ్లాదంగా గడిపారు. ఆ తర్వాత మంత్రి మేకపాటి తండ్రి , మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం నుంచి సహచర మంత్రులు సన్నిహితులు, అధికారుల శుభాకాంక్షలను ఫోన్ ద్వారా మంత్రి  అందుకున్నారు.  మంత్రి మేకపాటి ఓఎస్డీ అనిల్ కుమార్,  పీ.ఏ సాయిగోపాల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సందీప్, తదితర అధికార యంత్రాంగం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మంత్రి మేకపాటితో కేక్ కట్ చేయించారు. తన కోసం రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, ఆత్మకూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన ఆత్మీయులు, స్నేహితులను మంత్రి కలుసుకున్నారు. వచ్చిన వారందరూ విషెష్ చెబుతుంటే సరదాగా పలకరిస్తూ కృతజ్ఞతలు చెబుతూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన 50వ పుట్టినరోజునాడు సంతోషంగా గడిపారు.