కంపోస్టు వాహనాల వినియోగం పెంచండి
- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, ఫిబ్రవరి 03, (రవికిరణాలు) : హోటల్ రంగంలో ప్రతిరోజూ మిగిలే వ్యర్ధ ఆహార పదార్ధాలను వ్యవసాయానికి అవసరమైన ఎరువుగా మార్చే కంపోస్టు మిషిన్ల వినియోగం పెంచాలని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి సూచించారు. స్థానిక మద్రాసు బస్టాండు సమీపంలోని మురళి కృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 200 కేజీల సామర్ధ్యంగల కంపోస్టు మిషన్ ను కమిషనర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరిచేందుకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా నూతన సాంకేతికతను
అమలుచేయనున్నామని తెలిపారు. నగరంలోని హోటళ్లు, కూరగాయల మార్కెట్లు తదితర వాణిజ్య సముదాయాలు ఇలాంటి సాంకేతికత కలిగిన మెషీన్లను వినియోగించి, తమ వద్ద మిగిలే వ్యర్ధాలను 24 గంటల్లోనే పంటల ఎరువుగా మార్చుకోగలరని సూచించారు. మెషిన్ పనితీరు, ఫలితాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అన్ని హోటళ్ల యజమానులను ఆహ్వానిస్తున్నామని, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అన్ని సంస్థలూ కంపోస్టు మెషీన్లు వాడేలా అవగాహన పెంచుతామని కమిషనర్ పేర్కొన్నారు. స్వంత ఇంటి వ్యర్ధాలను ఎరువుగా మార్చే ప్రక్రియను ప్రతీ గృహిణికి వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వివరించి, పారిశుద్ధ్య
నిర్వహణపై చైతన్యం పెంచుతామని కమిషనర్ ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా నగరంలో తొలి కంపోస్టు మెషిన్ ను ఏర్పాటు చేసినందుకు హోటల్ నిర్వాహకులు హాజరత్ బాబు, సుబ్బారావులను కమిషనర్ అభినందించారు.