చెత్త సేకరణ వృత్తిదారులను గుర్తించండి


 


అదనపు కమిషనర్ నందన్ 

నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, అట్టలు, ఇతర నిరుపయోగ వస్తువులను సేకరించి, మార్కెట్లో విక్రయించి జీవనం సాగించే వృత్తిదారులను గుర్తించి వారికి ఆర్థిక భద్రతను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ నందన్ తెలియజేశారు. 

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టం (నమస్తే) కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ ను కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు.

అనంతరం సమావేశం నిర్వహించి అదనపు కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నమస్తే పథకం ద్వారా గతంలో 93 మంది భూగర్భ డ్రైన్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కార్మికులకు ఐదు లక్షల విలువైన ఉచిత వైద్య సేవలు పొందే ఆయుష్మాన్ కార్డులను అందించామని తెలిపారు. 

ప్రస్తుతం నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య నోడల్ అధికారిగా, 30 మంది వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శుల బృందం నూతనంగా సర్వేలు నిర్వహించనున్నారని తెలిపారు. సచివాలయాల పరిధిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి విక్రయించుకునే వారి వివరాలను యాప్ ద్వారా నమోదు చేయించి, ఆ వృత్తిలో కొనసాగుతున్న వారందరితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నామని వివరించారు. 

ఎక్కువ సంఖ్యలో వ్యర్థాలను సేకరించే వారికి ఉచిత వాహనాలను అందించి వారి కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సేవలు అందించేలా ఆయుష్మాన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. 

నిరుపేద ప్రజల జీవన భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని అదనపు కమిషనర్ ఆకాంక్షించారు. 

ఈ సమావేశంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ సాయి కృష్ణ, శానిటేషన్ సూపర్వైజర్ నరసింహారావు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.