తాడేపల్లి – వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం. 

వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

తాడేపల్లిః

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్, శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి, శ్రీమతి వరదు కల్యాణి.. తదితరులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు ప్రసంగించారు. 

అల్లూరే మనకు స్ఫూర్తిః శ్రీ విజయసాయిరెడ్డి

శ్రీ విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ.. బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కులకోసం పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన చేసిన పోరాటం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఇంతటి ఘనచరిత కల్గిన స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరిని తరతరాలవారు స్మరించుకునేలా..  మనందరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగింది. అల్లూరి స్ఫూర్తితో, ఆదివాసీల హక్కుల్ని కాపాడటంలోనూ, వారికి అన్నిరకాలుగా అండదండలు అందించడంలో మన ప్రభుత్వం ముందుంది.  గిరిజనులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. వారి ఆధీనంలోని పోడు భూముల వ్యవసాయాన్ని ఎవరూ ఆటంకపరచకుండా వ్యవసాయ పట్టాల్ని ఇచ్చాం. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అల్లూరి గారిలాంటి కారణజన్ములు చాలా అరుదుగా పుడతారు. అలాంటివారిని స్మరించుకోవడం మన ఆదృష్టమని చెబుతూ.. వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. 

పార్టీ సీనియర్ నేత శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశచరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి రగులుతుంది. బ్రిటీషు పాలకులను ఎదిరించి పోరాడిన వీరుడు, యోధుడు మన అల్లూరి. ఈ సందర్భంగా అల్లూరి గారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను.

మాజీ ఎమ్మెల్సీ శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవకారుడు, తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి 126వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఆ మహానుభావుడ్ని తలుచుకోవడమే తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నట్లుగా మనం భావించాలి. అక్షరజ్ఞానం తెలియని అటవీజనాన్ని కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చేసిన మహాపురుషుడు అల్లూరి. తెలుగువారి చరిత్రలో అల్లూరి గారి త్యాగానికి ప్రత్యేకస్థానం ఉంది. 

ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కల్యాణి మాట్లాడుతూ.. అల్లూరి గారిని స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల సంక్షేమంపై జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం చిత్తశుద్ధితో  పనిచేస్తుందని చెప్పేందుకు గర్విస్తున్నాను.

ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్‌ సభ్యులు శ్రీ నందింగం సురేశ్, ఎమ్మెల్సీలు శ్రీ మొండితోక అరుణ్‌కుమార్, పార్టీ ఎస్టీ విభాగ అధ్యక్షుడు శ్రీ హనుమంతు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.