జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు  మంచి స్పందన 

 






రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత


 విజయవాడ : జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత తెలిపారు. నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత ప్రదర్శనను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాల్లో దళారుల ప్రమేయం లేకుండా, మేలు కలగజేయాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఈ కామర్స్ లో చేనేత వస్త్రాలు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేనేత వస్త్రాల గరిష్ట విక్రయాలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ప్రదర్శనలో సునీత వస్త్రాలు  కొనుగోలు చేశారు. వస్త్ర ప్రదర్శనకు వచ్చిన కొనుగోలు దారులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయిక్త సంచాలకులు  కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.