ఏపీ రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 1036 కోట్లు జమ..
రైతులకు పెట్టుబడి సాయంగా ఏపీ ప్రభుత్వం రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత నిధులను విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిధులు విడుదల చేశారు. దీని వల్ల ఏపీలో మొత్తం 50.58 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతులకు మొత్తం రూ. 1036 కోట్లు అందాయి. రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతీ ఏటా ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి సాగు సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా విడుదల చేసిన మూడో విడతలో భాగంగా 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద రూ. 2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేసింది. గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ. 2వేల చొప్పున వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు జమ చేసింది. కొత్తగా సాగు హక్కు పత్రాలు పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
రైతు భరోసా డబ్బు జమ అయిందో లేదో ఇలా తెసుకోండి..
రైతులు తమ ఖాతాల్లో రైతు భరోసా మొత్తం జమ అయ్యిందో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. అర్హులు రైతు భరోసా వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘నో యువర్ రైతు భరోసా స్టేస్’పై క్లీక్ చేయాలి. తర్వాత రైతు ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ నొక్కాలి. దీంతో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ డబ్బులు జమకాకపోవడం లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే 1902 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా గ్రామ, వార్డు వాలంటీర్‌నైనా స్పందించాలని సూచించారు.