- పాల ఉత్పత్తుల గోడౌన్ సీజ్

- ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకట రమణ

నెల్లూరు, డిసెంబర్‌ 24, (రవికిరణాలు) : ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికారకమైన కల్తీ ఆహార ఉత్పత్తుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. డాక్టర్ ఆధ్వర్యంలో స్థానిక నజీర్ తోట మసీదు వీధిలోని జాహ్నవి మిల్క్ ప్రోడక్ట్స్ గోడౌన్ లో పాల ఉత్పత్తులను కల్తీ చేస్తున్న మాఫియాపై కార్పొరేషన్ సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 200 లీటర్ల కల్తీ పాలు, పాల పౌడర్, 600 కేజీల కల్తీ నెయ్యి నిల్వలను, తయారీకి ఉపయోగించే మెషినరీని గుర్తించారు. కార్పొరేషన్ సిబ్బంది దాడులను గ్రహించిన తయారీదారులు గోడౌన్ వదిలి
పారిపోయారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట రమణ మాట్లాడుతూ అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ఉత్పత్తులను తయారు చేస్తున్న గోడౌన్ ను సీజ్ చేశామని, తయారీదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ ఉత్పత్తుల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని, సమీప ప్రాంతాల్లోని అనుమానిత ఆహార తయారీ కేంద్రాలపై తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.