రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చండి - ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి

తిరుపతి ఎంపీ గురుమూర్తికి వినతి పత్రం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు




రవి కిరణాలు తిరుపతి:-


ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు ఉద్యమ నాయకులు డిమాండ్ చేసారు. నేడు తిరుపతి లోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తిని కలిసి వినతి పత్రం సమర్పించారు.  2020 - 21 రైతు ఉద్యమం సందర్భంగా సంయుక్త కిసాన్  మోర్చా  నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వ్రాత పూర్వక హామీలు అయినటువంటి అన్ని పంటలకు సి2+50 శాతం ప్రకారం మద్దతు దరల చట్టం అమలు, రైతులు, వ్యవసాయ కార్మికులకు ఒకసారి రుణ విముక్తి చేసి వ్యవసాయ ఆత్మహత్యలు నివారణ, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల రద్దు, అన్ని పంటలకు సమగ్ర పంటల భీమా, రైతులు, వ్యవసాయ కార్మికులకు పంటల భీమా, రైతు అనుకూల భూసేకరణ చట్టం లాంటి మొదలగు హామీలను అమలు కోసం పార్లమెంటులో చర్చించి అమలు కోసం కృషి చేయాలని ఎంపీని కోరగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ కరువు, అకాల వర్షాలు, వరదలతో లాంటి ప్రకృతి విపత్తులతో రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమైనవని వారు పండించిన పంటలకు గ్యారంటీ లేకుండా పోవడం రైతులు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారని ఆయన అన్నారు. అందు కోసం వారు పండించిన పంటకు మద్దతు ధర తోపాటుగా పంటల భీమా అవసరమన్నారు. వ్యవసాయం చేస్తూ వయసు మళ్ళిన రైతులకు పెన్షన్ విధానం ఏర్పాటు చేయాలని రైతు కూలీల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని జిడిపిలో రైతులకి సంబంధించి వారి సమస్యలకి సంబంధించి ఖచ్చితమైన వాటా ఉండాలని ఇలా పలు సమస్యలతో తనకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి వారు వినతి పత్రం ఇచ్చారని ఈ సమస్యలపై పార్లమెంటులో చర్చించడమే కాకుండా సంబంధిత శాఖల మంత్రులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.